ద‌గ్గు సిర‌ప్ తాగిన 66 మంది చిన్నారులు మృతి…!డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక.. నాలుగు దగ్గు సిరప్‌లపై విచారణ..

ఆఫ్రికా దేశం గాంబియాలో ద‌గ్గు సిర‌ప్ తాగిన 66 మంది చిన్నారులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ అంశాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో హ‌ర్యానాలో ఉన్న ఫార్మ‌సీ కంపెనీకి చెందిన నాలుగు ర‌కాలు ద‌గ్గు సిర‌ప్‌(Cough Syrups )ల‌పై భార‌త ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. ద‌గ్గు సిర‌ప్‌ల గురించి డీసీజీఐకి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఫిర్యాదు చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. సెప్టెంబ‌ర్ 29వ తేదీన ఈ ఫిర్యాదు అందింది. అయితే ఈ అంశాన్ని త‌క్ష‌ణ‌మే హ‌ర్యానా రెగ్యులేట‌రీ సంస్థ‌తో డీసీజీఐ సంప్ర‌దించింది. ఆ వెంట‌నే ద‌గ్గు సిర‌ప్‌ల‌పై విచార‌ణ‌కు ప్ర‌భుత్వం ఆదేశించింది…హ‌ర్యానాలోని సోనిప‌ట్‌లో ఉన్న మైదాన్ ఫార్మ‌సీ కంపెనీలో ద‌గ్గు సిర‌ప్‌ల ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. అయితే గాంబియాకు ఈ కంపెనీ నుంచే సిర‌ప్‌లు ఎగుమితి అయిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కంపెనీ ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్పందించ‌లేదు. ప‌శ్చిమ ఆఫ్రికాలో ఆ సిర‌ప్‌ల‌ను డిస్ట్రిట్యూట్ చేసి ఉంటార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఈ సిర‌ప్‌లు ఇత‌ర దేశాలకు వెళ్ల‌కుండా ఉండేందుకు ముంద‌స్తుగా ఆ సంస్థ హెచ్చ‌రిక జారీ చేసింది.

గాంబియాలో మృతిచెందిన 66 మంది చిన్నారులు నాలుగు ర‌కాల ద‌గ్గు సిర‌ప్‌లు వాడిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ సిర‌ప్‌లు వాడ‌డం వ‌ల్ల‌ చిన్నారుల్లో తీవ్ర‌మైన కిడ్నీ గాయాలైన‌ట్లు తేల్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. ప్రొమిథ‌జైన్ ఓర‌ల్ సొల్యూష‌న్‌, కోఫెక్స‌మాలిన్ బేబీ క‌ఫ్ సిర‌ప్‌, మాకాఫ్ బేబీ క‌ఫ్ సిర‌ప్‌, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిర‌ప్‌ల వాడ‌కం గురించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది.క‌డుపు నొప్పి, వాంతులు, విరోచ‌నాలు, మూత్ర విస‌ర్జ‌న‌లో స‌మ‌స్య‌లు, త‌ల‌నొప్పి, కిడ్నీ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అయితే గాంబియాలో చోటుచేసుకున్న చిన్నారుల మృతి గురించి డ‌బ్ల్యూహెచ్‌వో మాత్రం పూర్తి స‌మాచారాన్ని వెల్ల‌డించ‌లేదు.హర్యానా రెగ్యులేటరీ సంస్థతో డీసీజీఐ సంప్రదించింది. ఆ వెంటనే దగ్గు సిరప్‌లపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది..