ఏపీ మున్సిపల్ స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్..
రేపటి నుంచి 16 వరకు నామినేషన్లు
ఈ నెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు
4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు....
AP Election Schedule 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలుకానుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగాల్సిన 23 మున్సిపల్ స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ను నవంబర్ 12న విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల వివరాలను వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. గతంలో న్యాయపరమైన సమస్యలు, వివిధ వివాదాల కారణంగా ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా ఆ అడ్డంకులు తొలగడంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికలు జరగనున్న 23 సంస్థల్లో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు వెలువడనున్న ప్రకటనతో ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై స్పష్టత రానుంది..