బంగ్లాదేశ్‌లో మత వ్యతిరేక అజెండా నుంచి హిందువులను రక్షిస్తా… ట్రంప్‌..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండో-అమెరికన్‌ ఓటర్లు కీలకంగా మారారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనటం వల్ల అభ్యర్థులిద్దరూ ఆ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిష్టియన్లు, ఇతర అల్పసంఖ్యాకులపై జరిగినదాడిని తీవ్రంగా ఖండించారు. తన హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ అమెరికాతోపాటు ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని ట్రంప్‌ విమర్శించారు. అమెరికా, బంగ్లాదేశ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. రాడికల్‌ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక అజెండా నుంచి హిందువులను రక్షిస్తానని ట్రంప్‌ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌-అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని హామీఇచ్చారు ట్రంప్‌ ప్రకటనపై హిందూస్‌ ఫర్‌ అమెరికా ఫస్ట్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ఉత్సవ్‌ సందూజ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు..