* స్పెయిన్లోని వాలెన్సియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
* దీని కారణంగా ఇప్పటివరకు 205 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.
* అనేకమంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు. మరోవైపు వరదల్లో వందల కార్లు కొట్టుకుపోయాయి.
* ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
* సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి…
కనివినీ ఎరుగని రీతిలో స్పెయిన్ను ముంచెత్తిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో ఇప్పటివరకు 205మంది మరణించారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. దీంతో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద బురదలో చిక్కుకుపోయిన కార్లలో, నానిపోయి కూలిన భవనాల్లో ఇంకా మృతదేహాలు వున్నాయేమోనని గాలిస్తున్నారు. వరదల ధాటికి తూర్పు వలెన్సియా ప్రాంతం బాగా దెబ్బతింది. అక్కడే 155 మరణాలు నమోదయ్యాయి. సునామీని గుర్తు తెచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్లు ఒకదానిపైకి ఒకటి ఎక్కేసి దొంతరలా కనిపిస్తున్నాయి. కూకటి వేళ్లతో సహా కూలిపోయిన వృక్షాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, చెల్లాచెదురైన ఇళ్ళల్లోని సామాగ్రి ఇవన్నీ కూడా బురదలో కూరుకుపోయి కనిపిస్తున్నాయి. మధ్యధరా సముద్రతీరంలోని బార్సిలోనా దక్షిణ ప్రాంతమైన వలెన్సియాలో వీధులన్నీ అదే రీతిలో దర్శనమిస్తున్నాయి. ఇరుకైన వీధులను ముంచెత్తిన బురదతో కూడిన వరద ప్రవాహం తీవ్ర విపత్తుకు దారి తీసింది. అకస్మాత్తుగా సంభవించిన వరదల వల్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు గుర్తు పట్టడానికి వీల్లేకుండా ధ్వంసమయ్యాయి. ముందుగా బాధితులకు సాయమందించడమే తమ ప్రధాన కర్తవ్యంగా వుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ చెప్పారు..