తెలంగాణలో నేడు పాఠశాలలకు సెలవు.. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు…గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరు, నాయకులు, సంస్కర్త, అన్నింటికంటే మించి మన కాలంలోని మానవతావాది మన్మోహన్ సింగ్ అని అన్నారు.
సద్గుణం, నిష్కళంకమైన సమగ్రత, నిర్ణయం తీసుకోవడంలో అన్నింటికంటే మానవీయ స్పర్శతో గుర్తించబడిన వ్యక్తి, డాక్టర్ సింగ్ కొత్త భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాజకీయ, ప్రజా జీవితానికి మర్యాద, పద్ధతి ఎంత అవసరమో ఆయన చూపించారు. మన్మోహన్ ఒక లెజెండ్, ఆయన మరణంతో భారతదేశం ఒక గొప్ప కొడుకును కోల్పోయిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణలో నేడు సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం తెలంగాణలో సెలవు దినంగా ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్య సంస్థలకు సెలవు ఇచ్చింది. మన్మోహన్ మృతితో రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
మంత్రుల సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ద్రిగ్బాంతి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 15వ లోక్ సభలో ఆయన ప్రధానిగా తాను లోక్ సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయిందన్నారు. దేశం ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన మహనీయులు మన్మోహన్ సింగ్ అని అన్నారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక విప్లవాత్మకమైన చట్టాలు తెచ్చి అమలు చేసిన గొప్ప రాజనీతిగల నేత. ఆయన మరణం దేశానికి తీరని.లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఓబీసీ రిజర్వేషన్లు, హక్కుల గురించి ఆయనతో మాట్లాడిన అంశాలను గుర్తు చేసుకున్నారు.
కాగా, మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.