🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 27 – 12 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిథి : *ద్వాదశి* రా1.14 వరకు,
నక్షత్రం : *విశాఖ* రా7.58 వరకు,
యోగం : *ధృతి* రా10.43 వరకు,
కరణం : *కౌలువ* మ12.20 వరకు,
తదుపరి *తైతుల* రా1.14 వరకు,
వర్జ్యం : *రా12.17 – 2.01*,
దుర్ముహూర్తము : *ఉ8.43 – 9.27*
మరల *12.22 – 1.06*,
అమృతకాలం : *ఉ10.19 – 12.04*,
రాహుకాలం : *ఉ10.30 – 12.00*,
యమగండం : *మ3.00 – 4.30*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.32,
సూర్యాస్తమయం: 5.29,
*_నేటి పాశురం_*
*తిరుప్పావై పాశురం – పన్నెండవ రోజు ప్రవచనం*
*12 వ పాశురము*
*కనైత్తిళజ్గత్తెరుమై కన్ఱుక్కిరజ్గి,*
*నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,*
*ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!*
*పనిత్తలైవీళ నిన్ వాశల్ కడైపత్తి*
*చ్చినత్తినాల్ తెన్నిలజ్గైక్కోమానైచ్చెత్త*
*మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్*
*ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరు ఱక్కమ్*
*అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.*
*భావం*
లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ వున్నాయి. ఆ పాల ధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదయైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లిలివైతివి. ఓయమ్మా! మేమందరము నీవాకిటకు వచ్చి పైనమంచు కురియుచున్నను సహించి నీ గడపనానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని వున్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతూంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్చిన్నంగా పొంగిపొరలుతున్నా ఈ ముప్పేట ధారలతో తడిసి, తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీవాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి వున్నామమ్మా! ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తున్నాము. కీర్తిస్తున్నాము. పాడుతున్నాము. మేమింత చేయుచున్ననూ నీవు నోరైన మెదుపుట లేదేమి తల్లీ! ఇది యేమి మొద్దు నిద్దరమ్మా! నీ గొప్పతనాన్ని మేమెరిగితిమిలేవమ్మా. నీ మొద్దు నిద్దుర విషయమంతా ఊరూ వాడ తెలిసిపోయిందిలే! ఇక నీ మొద్దునిద్దర చాలించి మేలుకో! (నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో) మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తిచేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు.
*అవతారిక*
లక్ష్మణస్వామివలె శ్రీకృష్ణుని యెడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకొనే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపుని చెల్లిలిని మేల్కొలుపుతున్నారు. గోపాలురు, గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కల్గనంతవరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు. ఆ కృష్ణ సేవకు యీ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వానిని వెంటనే పరిత్యజించి కృష్ణసేవకే అంకితమయ్యే ధన్యజీవులీ గోకులంవారు. ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే. శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయటమే యీ జన్మ సార్ధక మంత్రం’ కాబట్టి తైలధారవలెను, నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాళ్ తల్లి (యీ మాలికలో) వివరిస్తోంది.
*(హమీరు కల్యాణి రాగము – ఏకతాళము)*
ప.. ఇకనైనను లేచిరావె! ఏమి మొద్దునిద్దరే?
ఇకనైనను నోరు తెరచి మాటాడగ రాగదే?
అ..ప.. ఈ కన్నియలందరు నీ వాకిట గుమిగూడిరని
ఒకరొకరికి కాదు, ఊరు వాడంతట తెలిసినదే!
1. చ.. పాలు పిదుకువారు లేక మహిషీ గణ మరచుచు
పాలుద్రాగు లేగలందు భావము ప్రసరించి కారు
పాలముంగిలి తడియు సంపదగల వానికి చెల్లెల!
తలను మంచు పడుచున్నదె! గడప నాని యున్నామే!
2. చ.. దక్షిణ లంకకు ప్రభుడగు రావణు జంపినవానిని
అక్షయ మోదము గూర్చిన ఆ ఘన శ్రీరాముని
ఏ క్షణమును వీడక కీర్తించుచుండ వినలేదా?
ఈ క్షణమ్మునైన లేచి రావమ్మా! కొమ్మరో!
ఇక నైనను లేచిరావె!
_*తిరుప్పావై ప్రవచనం – 12 వ రోజు*_
*లక్ష్మణుడి కర్మ విదానం*
*ఆండాళ్ తిరువడిగలేశరణం*
*12 వ పాశురము*
*కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి*
*నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర*
*ననైత్త్-ఇల్లం శేఱాక్కుం* *నచ్చెల్వన్ తంగాయ్*
*పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి*
*శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త*
*మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్*
*ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్*
*అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్*
భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితి కి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశ ను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్శణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.
*”ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే |*
*ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్ || “*
వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.
*”దుఖెఃషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:*
*వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే “*
ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు. ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.
*”ఇళంకత్తెరుమై”* లేత దూడలు కల్గిన గేదెల *”కనైత్త్”* అరుపు వినిపిస్తోంది, ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమజ్ఞమై ఉన్నారు. *”కన్ఱుక్కిరంగి”* దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే *”నినైత్తు”* దూడ వచ్చిందని భావించి, *”ములై వరియే”* పొదుగుల గుండ *”నిన్ఱు పాల్ శోర”* ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. *”ననైత్త్-ఇల్లమ్”* ఇల్లంతా తడిసి పోయి , *”శేఱాక్కుమ్”* అంతా బురద అయ్యింది.
ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే. నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.
*”నచ్చెల్వన్ తంగాయ్”* ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది. *”పనిత్తలై వీర”* మంచుతో పైన తడుస్తున్నాం, ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం క్కొట్టుకు పోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి *”నిన్ వాశల్ కడై పత్తి”* అమ్మా నీ గుమ్మపు పై కప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .
అయితే లోపలున్న గోప బాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు *”శినత్తినాల్”* కోపంతో *”తెన్ ఇలంగై క్కోమానై”* అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి *”చ్చెత్తమ్”* సంహరించి, *”మనత్తుక్కినియానై”* అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం *”ప్పాడవుమ్”* పాడుతున్నా *”నీ వాయ్ తిఱవాయ్”* నీవు నోరు తెరవవా! *”ఇనిత్తాన్ ఎరుందిరాయ్”* ఇక నైనా నోరు తెరిచి లేవమ్మా. *”ఈదెన్న పేర్ ఉఱక్కమ్”* ఇది ఎలాంటి నిద్రమ్మా, *”అనైత్తిల్లత్తారుం అఱింద్”* లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏