ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం.. సైన్యానికి సెల్యూట్: ప్రధాని మోదీ…!

*ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం.. సైన్యానికి సెల్యూట్: ప్రధాని మోదీ*

ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ చెప్పారు.

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ఆయన తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుద ముట్టిస్తామని స్పష్టం చేశారు. ‘న్యూక్లియర్‌ బ్లాక్‌మెయిలింగ్‌’కు పాల్పడితే సహించేది లేదని పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రకటించారు.

*సైన్యం సాహసం, పరాక్రమానికి సెల్యూట్‌*

”గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని, సంయమనాన్ని చూస్తున్నాం. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. సైన్యం సాహసం, పరాక్రమానికి నా సెల్యూట్‌. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికం. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయింది. ఉగ్ర దాడులపై ప్రతి హృదయమూ జ్వలించింది”

*బెంబేలెత్తిన పాక్‌.. చర్చలకు పరుగెత్తుకొచ్చింది..*

”పౌరులు, పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచాయి. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ‘ఆపరేషన్‌ సిందూర్‌’. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్‌ దెబ్బతీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి. బహావల్‌పుర్‌, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని భారత్‌ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు ఏం చేస్తుందో భారత్‌ చెప్పింది. పాక్‌ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం చేశాం. పాకిస్థాన్‌ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్‌ తీసుకొచ్చింది. భారత్‌ చర్యలకు బెంబేలేత్తిపోయిన పాకిస్థాన్‌ కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. పాక్‌ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు”

*పాక్‌ రక్షణ వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం..*

”రెండున్నర దశాబ్దాలుగా పాక్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్‌ తుడిచిపెట్టింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ నుంచి కుట్రలు పన్నుతున్న ఉగ్రతండాలను తుదముట్టించింది. భారత్‌ దెబ్బకు పాక్‌ నిరాశనిస్పృహల్లో కూరుకుపోయింది. అచేతనావస్థకు చేరుకుంది. దాడులతో ఏటూ పాలుపోని పాక్‌.. భారత్‌లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది. పాక్‌ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను భారత్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. పాక్‌ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు ఛిన్నాభిన్నం చేశాయి. పాక్‌ వైమానిక స్థావరాలు, రాడార్‌ స్టేషన్లలో భారత్‌ మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి.”

*భారత్‌ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు*

”ఎలాంటి దుస్సాహసానికి పాక్‌ తెగబడినా మన దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్జికల్‌ స్ట్రైక్స్‌, బాలాకోట్ దాడులు, ఆపరేషన్‌ సిందూర్‌.. ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్‌ షరతుల మేరకే చర్చలు ఉంటాయి. భారత్‌ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయి. పాకిస్థాన్‌ అణు బ్లాక్‌మెయిలింగ్‌ ఇక సహించేది లేదు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, భారత్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్‌ తుదముట్టించి తీరుతుంది. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటో ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాక్‌ చవిచూసింది. సాంకేతిక యుద్ధంలో భారత్‌ పరిణతి, ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. మేడిన్‌ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో.. ఎంత శక్తిమంతమైనవో చాటింది”

*పాకిస్థాన్‌ బతికి బట్టకట్టాలనుకుంటే.. మోదీ సీరియస్‌ వార్నింగ్‌*

”ఈ యుగం యుద్ధాలది కాదు.. ఉగ్రవాదానిది అంతకన్నా కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకూ భారత్‌ వెనుకాడదు. ఉగ్రవాదానికి అన్నపానీయాలు అందించే ఎవరినీ ఉపేక్షించదు. పాక్‌ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలి. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకాకలంలో ఉండవు. ఉగ్రవాదం, వాణిజ్యం రెండూ ఏకాకలంలో ఉండవు. ఉగ్రవాదం, నీటి పంపిణీ రెండూ ఏకాకలంలో ఉండవు” అని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ గట్టిగా హెచ్చరికలు పంపారు.