నేటి నుంచి షూటింగ్‌లు..ముగిసిన సమ్మె…!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల పోరాటం ఫలించింది. వేతన పెంపునకు నిర్మాతలు, కార్మికుల ఫెడరేషన్‌ మధ్య అంగీకారం కుదిరింది. నేటి నుంచి షూటింగ్‌లు యధాతథంగా కొనసాగనున్నాయి. గురువారంనాడు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాధర్‌ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని కార్యాలయంలో ఇదే విషయమై గురువారం రాత్రి పొద్దుపోయే వరకూ సుదీర్ఘ చర్చలు జరిగాయి. తెలుగు సినీ నిర్మాతల మండలి, కార్మికుల పక్షాన ఫిలిం ఫెడరేషన్‌ తరపున ఐదుగురు చొప్పున ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణా ఫిలిం ఛాంబర్‌ కార్యాలయంలో ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌రాజు, కార్మికశాఖ అదనపు కమిషనర్‌ గంగాధర్‌ సమావేశ వివరాలను వెల్లడించారు. 22.5 శాతం వేతన పెంపునకు ఇరుపక్షాలు అంగీకరించినట్లు తెలిపారు. రూ.2 వేలలోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం, రూ.2 వేల నుంచి రూ.5 వేలు ఉన్నవారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు. పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత ప్రిన్సిపల్‌ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వేతనాలను 30 శాతం మేర పెంచాలని కోరుతూ ఈ నెల 4 నుంచి సినీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. సిఐటియు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించింది. పోరాటం ఫలించడంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.