ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 23 – 08 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
బహుళ పక్షం,
తిథి : *అమావాస్య* ఉ11.17 వరకు,
నక్షత్రం : *మఖ* రా1.40 వరకు,
యోగం : *పరిఘము* మ3.09 వరకు,
కరణం : *నాగవం* ఉ11.17 వరకు,
తదుపరి *కింస్తుఘ్నం* రా11.15 వరకు,
వర్జ్యం : *మ1.28 – 3.06*
దుర్ముహూర్తము : *ఉ5.46 – 7.27,*
అమృతకాలం : *రా11.14 – 12.51,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 5.47, సూర్యాస్తమయం: 6.19,
*_నేటి విశేషం_*
*పోలాల అమావాస్య*
*పోలాల అమావాస్య (పోలాంబ వ్రతం) నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి ?*
పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత.
దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.
🌸ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.
🌿పోలాల అమావాస్య
వ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో “పోలాల అమవాస్య వ్రతం” ఒకటి.
🌸దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య’ అని పేరు. దీనికే ‘పోలాల అమావాస్య , పోలాలమావాస్య , పోలాంబవ్రతం’ వంటి పేర్లు కూడా ఉన్నాయి.
🌿ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం’ తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది.
🌸ఈ వ్రతమునకు సంబంధించి ఆసక్తికరమైన ఒకగాథ ప్రచారంలో ఉంది.
🌿పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు.
🌸వారికి సంతానం కూడా కలిగింది. ఆ ఏడుమందీ తల్లిదండ్రుల వద్ద నుంచి వేరై… అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు.
🌿తమ సంతానం బాగా ఉండాలంటే ‘పోలాంబ’ అమ్మవారిని శ్రావణమాసంలో అమవాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్న ఆ ఏడుమంది శ్రావణ అమవాస్య కోసం ఎదురుచూడ సాగారు.
🌸శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలను ఆచరించారు. చివరిరోజు అయిన అమవాస్యనాడు పోలాంబవ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.
🌿ఏడుగురు కోడళ్ళ ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు. వ్రతం నాటి ఉదయాన్నే ఏడో కోడలి బిడ్డ మరణించింది.
🌸ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపొయ్యారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు.
🌿కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతంచేయలేకపోవడం…
🌿ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరుమంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది.
🌸మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు.
🌿అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని , వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన ఏడో కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.
🌸చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి , మిగతా కోడళ్ళందరి తో కలిసి వ్రతంలో పాల్గొంది.
🌿అందరూ ఆనందంతో వ్రతం చేస్తూన్నా… తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యూంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలా గడిచింది.
🌸చీకటిపడి గ్రామం సదుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న ‘పోలేరమ్మ’ గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి , తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది. ఎలా ఖననం చేయాలి ? అని ఏడ్వసాగింది.
🌿ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని , అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చొనడానికి కారణం అడిగింది.
🌸దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది.
🌿వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు యిచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువవలసిందిగా చెప్పింది.
🌸ఏడవకోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి , ఇంటికి చేరుకుంది.
🌿మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు తోడి కోడళ్ళతోపాటూ గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది.
🌸వారందరూ ఎంతో సంతోషించారు. అంతే కాకుండా అప్పటి వరకూ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్పబడుతూ ఉంది.
🌿కాగా , ‘పోలేరమ్మ అమ్మవారు’ గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు ఉండడం గాని , లేదంటే బహీరంగంగా కొలువుదీరి పూజలందుకుంటూ ఉండడం గానీ చూడవచ్చు.
🌸ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.
🌹పాటించవలసిన ముఖ్య నియమములు..🌹
🌿తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని , తలస్నానంచేసి , ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి , ఇంటికి చేరుకుని పూజాగదిలో పోలేరమ్మను పసుపుకొమ్ముతో గానీ , పసుపుతోగాని చేసుకొని ప్రతిష్టించుకుని పూజ చేయాలి.
🌸ఈ పూజావిధానములో పార్వతీ దేవి అష్ణోత్తరం చదవుతూ ఉండడం విశేషం. పూజ ముగించిన అనంతరం పసుపు పూసిన దారానికి పసుపుకొమ్మ కట్టి తయారుచేసుకున్న తోరము’ ఒకదానిని తీసుకుని పోలేరమ్మకు సమర్పించడంతో పాటూ , మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి.
🌿ఈ విధంగా పూజచేసి *‘పెరుగు అన్నం’* ను నైవేద్యంగా సమర్పించి పూజ ముగించాలి. పెరుగన్నమును ప్రసాదంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి.
🌸ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమవాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందనీ , సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్రాలు చెబుతున్నాయి…
స్వస్తి…🙏🌹
*_🌸శుభమస్తు🌸_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏