సుంకాల ఉద్రిక్తతల మధ్య భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు..!

సుంకాల ఉద్రిక్తతల మధ్య భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ సలహదారు పీటర్ నవారో వెల్లడించారు. దిల్లీ వేదికగా మంగళవారం నుంచి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అగ్రరాజ్యం విధించిన 50శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికాతో మంగళవారం ఆరోవిడత చర్చలు జరగనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ప్రతినిధి బ్రెండెన్‌ లించ్‌ ఈ చర్చల్లో పాల్గొంటారని తెలిపింది. ఆగస్టులో ఆరోవిడత చర్చలు జరగాల్సి ఉండగా సుంకాలను అమెరికా 50శాతానికి పెంచటంతో సంప్రదింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

అమెరికా ప్రధాన మధ్యవర్తి, వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్.. సోమవారం రాత్రికి భారత్‌కు చేరుకోనున్నారు. భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్‌తో బ్రెండన్ లించ్.. చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం.. భారత్, అమెరికాలు చర్యలు జరుపుతూనే ఉన్నాయి. అయితే.. భారత్‌కు వ్యవసాయ, పాల ఉత్పత్తుల రంగాలు చాలా కీలకమైనవి కావడంతో.. వాటిని అమెరికాకు అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతదేశంలో ఈ రెండు రంగాలు అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తుండటంతో.. ఏదైనా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని నరేంద్ర మోదీ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది..

అంతకుముందు అమెరికా దిగుమతులపై ఏ దేశం వేయనంతగా భారత్‌ ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని నవారో ఆరోపించారు. ఈ భారీ టారిఫ్‌లను తాము ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా ఆక్రమించక ముందు ఆ దేశంతో భారత్‌ చమురు కొనుగోలు తక్కువగానే ఉండేదని తెలిపారు. ఆ తర్వాత నుంచి పెద్దమొత్తంలో లాభం పొందేందుకు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తోందని చెప్పారు. యూరోపియన్ యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా వంటి దేశాలు అమెరికాతో గొప్ప వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని గుర్తు చేశారు. అమెరికా నుంచి లాభం పొందామని, అగ్రరాజ్యం మార్కెట్లు తమకు అవసరమనే విషయాన్ని ఆ దేశాలు గుర్తించాయని పేర్కొన్నారు. ఈక్రమంలోనే భారత్‌ కూడా ఏదో ఒక సమయంలో తమ దారికి రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అలాకాకుండా రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే భారత్‌కు మంచి ముగింపు ఉండదంటూ హెచ్చరించారు.

మరోవైపు ఇదే విషయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ధ్రువీకరించారు. ‘భారత్ ఇప్పుడు అమెరికాతో మాత్రమే కాక, అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలు, వాణిజ్య కార్యక్రమాల గురించి ఇతర దేశాలకు తెలియజేయడానికి మేం వివిధ మిషన్లతో చురుకుగా పనిచేస్తున్నాం. చర్చల సామర్థ్యం పెరిగింది. అనేక ఉత్పత్తుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు అమల్లో ఉన్నాయి’ అని సునీల్ తెలిపారు..