రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్.
* బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
* హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది.
* ఈ నెల 8న హైకోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరగనున్న సంగతి తెలిసిందే..
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటీషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సోమవారం (అక్టోబర్ 06) విచారణలో భాగంగా పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం. ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు బెంచ్ లో విచారణ ఉన్న క్రమంలోనే.. తమ వాదనలను అక్కడే వినిపించాలని సూచిస్తూ.. పిటీషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నదని.. హైకోర్టు స్టే ఇవ్వకుంటే ఇక్కడికి వస్తారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటీషన్లను కొట్టివేసింది సుప్రీంకోర్టు..
ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దఫాల్లో, పంచాయతీ ఎన్నికలు మూడు దఫాల్లో మొత్తం ఐదు దశల్లో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నది. అయితే, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌చేస్తూ మాధవరెడ్డి హైకోర్టు పిటిషన్ వేశారు. గత రిజర్వేషన్లు రద్దుచేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, విచారణను 8వ తేదీకి వాయిదా వేయింది. ఇదిలా ఉండగానే సుప్రీంకోర్టులో వంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని గోపాల్ రెడ్డి తన పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్‌ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఈ పిటిషన్లో మాధవరెడ్డి, తీన్మార్ మల్లన్న ఇద్దరు కూడా ఇంప్లీడ్ అయ్యారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది..