పాత విధానంలో ముందుకెళ్లొచ్చు : హైకోర్టు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసినందున గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని తెలిపింది. స్థానిక సంస్థల కాలపరిమితి దాటినప్పుడు రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఎన్నికల సంఘం ఆ దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చంటూ రాహుల్ రమేశ్ వాగ్ కేసులో సుప్రీంకోర్టు 2022లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత : దీని ప్రకారం 42 శాతం జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని స్పష్టతను ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో9, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన 41,42లను , ఎన్నికల షెడ్యూలు నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల పూర్తి ప్రతి శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చింది.

ధర్మాసనం ఏం చెప్పిందంటే : వికాస్ కిషన్రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీవో 9, 41, 42లను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ప్రతివాదులు లేవనెత్తిన అన్ని అంశాలపై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. ఎన్నికలకు ముందుకు వెళ్లవచ్చు. అయితే రిజర్వేషన్‌లు 50 శాతానికి మించరాదు. దామాషా సీట్లను ఓపెన్‌ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. దీని కారణంగా రిజర్వేషన్‌లు 67 శాతానికి చేరతాయి. జీవో జారీ చేయకముందు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, ఓబీసీలకు 25 శాతం మొత్తం 50 శాతం రిజర్వేషన్‌లుండగా ఇవి వికాస్‌ కిషన్‌రావు గవాలి కేసులో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిమితికి లోబడి ఉన్నాయి.

ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు : ఓబీసీలకు రిజర్వేషన్‌లు కల్పించే ముందు కృష్ణమూర్తి కేసులో పేర్కొన్న ట్రిపుల్‌ టెస్ట్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే. ట్రిపుల్‌ టెస్ట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలపై సర్వే నిర్వహించడానికి ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేసి, కమిషన్‌ నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌లు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పరిమితి అన్నది కఠినమైన నియమం కాదని, సవరించుకునే వెసులుబాటు ఉందని వాదించింది..