హెచ్‌ 1 బీ వీసాలపై మరిన్ని ఆంక్షలు.. పలు మార్పులు ప్రతిపాదించిన ట్రంప్..!

ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డు అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి ట్రంప్‌ సర్కారు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది..ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డులను కోరుకునే అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల అర్హతలను హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం సవరించనున్నది. వచ్చే ఏడాది జనవరి నాటికి ఇవి సిద్ధం కావొచ్చు. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం విదేశీ నిపుణులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అర్హత, డాక్యుమెంటేషన్‌ ప్రమాణాలను ఇందులో ప్రభుత్వం నిర్వచించనున్నది. ఇది భవిష్యత్‌ దరఖాస్తుదారులు, యజమానుల నియామక వ్యూహాలను ప్రభావితం చేస్తుంది. అంటే సాధారణ నైపుణ్యాలు, సాధారణ అర్హతలు ఉన్న వారికి ఈ విభాగంలో గ్రీన్‌కార్డుల లభ్యత కఠినతరం కానుంది.
H-1b-visa
మరోవైపు హెచ్‌1బీ వీసా జారీపై కూడా ట్రంప్‌ సర్కారు మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. కొత్తగా జారీచేసే హెచ్‌1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు కట్టాలని ఇప్పటికే పేర్కొన్న ప్రభుత్వం.. తాజాగా వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేస్తున్నది.వీసా ప్రోగ్రామ్‌ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై, థర్డ్‌ పార్టీ నియామకాలపై మరింత దృష్టి సారించనున్నారు. హెచ్‌-1బీ వీసాల్లో సమగ్రతను తేవడానికి, అమెరికన్‌ కార్మికులకు సరైన వేతనాలు, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడానికి ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే డిసెంబర్‌ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది…