https://x.com/KreatelyMedia/status/1977036318330044687
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాకిస్తాన్ స్థావరాల వద్ద చిందులు వేస్తూ ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
కాబూల్ పై వైమానిక దాడులు చేసి కయ్యానికి కాలుదువ్విన పాక్ పై తాలిబన్లు విరుచుకుపడ్డారు. వీరు చేసిన దాడుల్లో కనీసం 58 మంది సైనికులు మరణించారని, మరో 30 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆదివారం ప్రకటించారు.
అయితే పాక్ సైతం తాలిబన్లపై ఎదురుదాడికి దిగినట్లు ప్రకటించింది. అనేక ఆఫ్ఘన్ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. డజన్ల కొద్ది ఆప్ఘన్ సైనికులతో పాటు ఖవారీజ్ సైనికులను హతమార్చినట్లు చెప్పుకుంది. కానీ తాలిబన్ చేసిన మరణాలను పాక్ ఇంకా ధృవీకరించలేదు.
ఐసిస్ ఉగ్రవాదులను తరిమికొట్టాలి
పాకిస్తాన్ లో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులను బహిష్కరించాలని ముజాహిద్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘పాకిస్తాన్ నేలలో దాక్కున్న ముఖ్యమైన ఐసిస్ ఉగ్రవాదులను బహిష్కరించాలని. లేదంటే వారిని వెంటనే ఇస్లామిక్ ఎమిరేట్ కు( తాలిబన్లకు) అప్పగించాలి.
ఐఎస్ఐఎస్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్ తో సహ ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పు కలిగిస్తుంది. ఇస్లామిక్ ఎమిరేట్ తన భూభాగాన్ని అశాంతి కలిగించే వారికి ఉపయోగపడదు. కానీ వారి కోసం ఫష్తుంఖ్వాలో కొత్త కేంద్రాలను స్థాపించారు. కరాచీ, ఇస్లామాబాద్ విమానాశ్రాయాల ద్వారా శిక్షణ కోసం ఈ కేంద్రాలకు తీసుకువచ్చారు’’ అని ముజాహిద్ అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లోని పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పాక్టియా ప్రావిన్స్‌లో రెండు దేశాల సరిహద్దు దళాల మధ్య ఘర్షణలు జరిగినట్లు సమాచారం. కాబూల్‌కు చెందిన టోలో న్యూస్ అమెరికాకు చెందిన ఎక్స్ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసిన నివేదిక ప్రకారం, పాక్టియాలోని పాకిస్తాన్ సరిహద్దు రేఖకు దగ్గరగా ఉన్న అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ మరియు పాకిస్తాన్ సరిహద్దు దళాల మధ్య ఘర్షణలు జరిగాయి.
రెండు దేశాల మధ్య సరిహద్దుగా పరిగణించబడే డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాకిస్తాన్ స్థావరాలను ఆఫ్ఘన్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని, పాకిస్తాన్ వైమానిక కార్యకలాపాలకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘర్షణల్లో 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని చెప్పగా, కొన్ని స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు వర్గాలు సూచించాయి. ప్రావిన్స్‌లోని దండే పటాన్ ప్రాంతంలో చెలరేగిన ఘర్షణల కారణంగా పౌరులు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చిందని స్థానిక నివాసితులు తెలిపారు..