ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్..అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు జమ.!..

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 19వ తేదీన కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అదేరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనుంది..
ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతీయేటా అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ప్రతీయేటా మూడు విడుతల్లో రూ.14వేలు జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతీయేటా రూ.6వేలు మూడు విడుతల్లో విడుదల చేస్తోంది. దీంతో ఇప్పటికే తొలి విడతలో ఆగస్టు నెలలో రూ. 7వేలు (అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు) రైతులు ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రస్తుతం ఈనెల 19వ తేదీన రైతుల ఖాతాల్లో మరో రూ.7వేలు (అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు) జమ కానున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న ‘పీఎం కిసాన్’ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ.2 వేలు జమచేయనున్నారు. ఈ విడతతో కలిపి ఇప్పటి వరకూ రూ.3.70లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ కింద ప్రయోజనం చేకూరనుంది..