జలవివాదంతో రాజకీయ లబ్ధి ప్రయత్నం: కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు.

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నీటి వాటాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘నీళ్లు–నిజాలు’ అంశంపై ప్రజాభవన్‌లో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటి వాటాలు, గతంలో జరిగిన తప్పులపై వివరించారు.
నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వినియోగించి ఉంటే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి విషయంలో అనేక పొరపాట్లు జరిగాయని, అప్పట్లో పీజేఆర్ కూడా సొంత ప్రభుత్వాన్ని నిలదీశారని గుర్తుచేశారు.
ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారని సీఎం తెలిపారు. రాష్ట్ర హక్కులను కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959