మంజా అవగాహన కోసం ‘రెస్పాన్సిబుల్ కైట్ ఫ్లయింగ్’ 2కే రన్
సింథటిక్ దారం (మంజా) వినియోగం వల్ల పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు ఏర్పడుతున్న ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘రెస్పాన్సిబుల్ కైట్ ఫ్లయింగ్’ పేరుతో పక్షుల ప్రేమికులు సంజీవయ్య పార్క్ పరిసరాల్లో 2 కిలోమీటర్ల అవగాహన రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ. సువర్ణ మాట్లాడుతూ, పతంగులు ఎగరవేసే సమయంలో సింథటిక్ దారం వాడకం వల్ల ప్రతి సంవత్సరం అనేక పక్షులు గాయాల పాలవుతున్నాయని, కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంజా వాడకం మనుషులకు కూడా ప్రమాదకరమని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలకు దారి తీస్తోందని తెలిపారు.
సింథటిక్ దారం వినియోగంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, సహజ దారాలతోనే పతంగులు ఎగరవేయాలని ఆమె పిలుపునిచ్చారు. పండుగల సమయంలో ఆనందంతో పాటు బాధ్యత కూడా ఉండాలని, పర్యావరణాన్ని కాపాడే విధంగా పతంగుల ఆట సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని, విద్యార్థుల నుంచే మంజా వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, ఎన్జీఓలు, వాలంటీర్లు ముందుకు రావాలని కోరారు.
ఈ 2కే రన్లో పెద్ద సంఖ్యలో పక్షుల ప్రేమికులు, యువత, వాలంటీర్లు పాల్గొని మంజా నిషేధానికి మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన పతంగుల ఎగరవేతపై స్పష్టమైన సందేశం వెళ్లిందని నిర్వాహకులు తెలిపారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959