కోనసీమలో ఎగిసిన అగ్నిజ్వాలలు ఎగిశాయి. కొబ్బరి తోటల్ని ఆజ్యం..ఇంకా అదుపులోకి రాని మంటలు.!

పచ్చని కోనసీమ గుండెలపై చమురు సంస్థలు మరో కుంపటి రాజేశాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీకి చెందిన మోరి-5వ నెంబరు బావి వద్ద ఒక్కసారిగా బ్లోఅవుట్‌ సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. ఇరుసుమండ గ్రామం వద్ద ఉన్న బావిలో నెలరోజులుగా గుజరాత్‌కు చెందిన డీప్‌ సీ ఇండస్ట్రీస్‌ సంస్థ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్‌ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. సోమవారం ఉ.11 గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్‌ చేస్తుండగా సహజ వాయువు (గ్యాస్‌) ఒక్కసారిగా పైకి ఎగదన్నుకు వచ్చింది. తొలుత ఆ ప్రాంతమంతా గ్యాస్‌ ఎగజిమ్మగా తరువాత మంటలు చెలరేగాయి. చెవులు చిల్లులు పడే శబ్దంతో గ్యాస్‌ ఎగదన్నడం.. మంటలు చెలరేగడంతో సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని దశాబ్ద కాలం కిందట మూసివేసిన ఈ బావి వద్దే ఇప్పుడు మళ్లీ పనులు చేపట్టడం,బ్లోఅవుట్‌ సంభవించడంతో చమురు సంస్థలపై స్థానికులు మండిపడుతున్నారు.

భారీ శబ్దాలతో పొగలా విస్తరించిన గ్యాస్‌..
దీనిని అదుపు చేసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు విఫలం కావడం… రానురానూ తీవ్ర పీడనంతో గ్యాస్‌ బయటకు ఎగదన్నుకు వస్తుండడంతో సిబ్బంది రిగ్గును వదిలి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో రిగ్‌ వద్ద పదిమంది వరకూ సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గ్యాస్‌ ఎగదన్నుకు వస్తూనే ఉంది. ఆ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్‌ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి, సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

అసలేం జరిగిందంటే..

ఇరుసుమండ గ్రామంలోని ఈ ప్రదేశంలో 1993లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ నిర్వహించింది. ఆ తర్వాత ఈ బావిని వదిలేసింది. అయితే ఈ బావిని ఓఎన్జీసీ సంస్థ 2024లో డీప్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సబ్‌లీజుకు ఇచ్చింది. ఇక్కడ ‘వర్క్‌ ఓవర్‌ రిగ్‌తో’ ఆ సంస్థ అన్వేషణ చేపట్టి.. ఈ బావిలో అపార చమురు, గ్యాస్‌ నిక్షేపాలున్నట్టు గుర్తించించింది. ఈ క్రమంలో గతంలోనే డ్రిల్లింగ్‌ పూర్తయిన ఈ బావిలో సోమవారం మరింత లోతుగా 2.7 కిలోమీటర్లు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అధిక ఒత్తిడితో గ్యాస్‌ విస్ఫోటం సంభవించింది. సుమారు అరగంట తర్వాత మరో విస్ఫోటంతో భారీ శబ్ధాలతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వంద అడుగుల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయకంపితులై ఇళ్లను ఖాళీ చేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. భూగర్భ పొరల్లో 30 నుంచి 40 మిలియన్‌ టన్నుల గ్యాస్‌, చమురు నిల్వలు ఉన్నట్టు అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. ప్రస్తుతం డ్రిల్లింగ్‌ సైట్‌ వద్ద మంటలు వంద అడుగుల ఎత్తు, 25 మీటర్ల వ్యాసార్థంతో ఎగసిపడుతున్నాయి. దీంతో సైట్‌ వద్ద ఉన్న వాహనాలు, రిగ్‌ పరికరాలు కాలి బూడిదవుతున్నాయి. కొబ్బరిచెట్లు, పంటపొలాలు బుగ్గిపాలవుతున్నాయి. బావిలో భారీగా చమురు, సహజవాయు నిక్షేపాలు ఉన్నందున ప్రస్తుతం ఈ భారీ బ్లో ఔట్‌ను అదుపు చేయడం కష్టమేనని ఓఎన్జీసీ భావిస్తోంది. పైపులైను వ్యవస్థ కూలిపోవాలి లేదంటే మొత్తం గ్యాస్‌ రిజర్వాయర్‌ మండి పీడనం తగ్గితే తప్ప దీన్ని అరికట్టలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ప్రధాన పంట కాల్వ నుంచి నీటిని వెదజల్లే ప్రక్రియను అధికారులు చేపట్టారు..

ఏ ఇంట్లో పొయ్యి వెలగలేదు.పల్లెల్లో చీకట్లు

గ్యాస బ్లో ఔట్‌ అయినప్పటి నుంచి ఏ ఇంట్లో పొయ్యి వెలగలేదు.పల్లెల్లో చీకట్లు కమ్ముకున్నాయి. పచ్చని కోనసీమ గుండెలపై గ్యాస్‌ మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. అదుపు చేయడానికి ఇంకెంత టైమ్‌ పడుతుందో క్లారిటీ రావడంలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారయ యంత్రాంగాన్ని ఆదేశించారు, మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్‌ మహేష్‌ ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తున్నారు.

ప్రస్తుతానికైతే ఇంకా కోనసీమ బ్లోఅవుట్‌ మంటలు అదుపులోకి రాలేదు. ఇరుసుమండ బ్లోఅవుట్ దగ్గర ఆపరేషన్ కొనసాగుతోంది. గూడపల్లి-1 కాలువ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టారు. పైపులు వేసి నిరంతరం నీటిని జల్లుతున్నారు ఫైర్‌ సిబ్బంది. అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్లను మోహరిస్తున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్‌ టీమ్స్‌ వస్తున్నాయి.

అలాగే వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు అధికారులు…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959