శంకర వర ప్రసాద్ గారు మూవీ రివ్యూ.

నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేష్, కేథరిన్ త్రెసా, సచిన్ ఖేడ్ కర్, బుల్లి రాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ తదితరులు

ఎడిటింగ్: తమ్మి రాజు.
సంగీతం: భీమ్స్

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: అనిల్ రావిపూడి

నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసారు. నయనతార, క్యాథరిన్ త్రెసా, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సచిన్ ఖేద్కర్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు…

కథ:
శంకరవరప్రసాద్ (చిరంజీవి) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. కేంద్ర మంత్రి దగ్గర సెక్యూరిటీగా ఉంటాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కాని చిన్నచిన్న ఈగోలతో విడిపోతారు. తన పిల్లల్ని కూడా చూడలేకపోతున్నాను అని శంకరవరప్రసాద్ బాగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి సమయంలో తన టీం నారాయణ (హర్షవర్ధన్), జ్వాల (కేథరిన్ త్రెసా) మరో ఇద్దరితో కలిసి పిల్లలకు దగ్గర ఇవ్వడానికి ఒక ప్లాన్ వేస్తారు. అదే సమయంలో శశిరేఖ తండ్రి మీద అటాక్ జరుగుతుంది. అది ఎవరు చేశారో తెలుసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ శంకర వరప్రసాద్ ను శశిరేఖ ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ గా పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఎలా విడిపోయిన భార్యాభర్తలు కలిశారు అనేది మిగిలిన కథ..

కథనం:
కథ కావాలి.. కథనం ఉండాలి అనుకుంటే మన శంకరవరప్రసాద్ గారు చాలా రొటీన్ గానే అనిపిస్తారు. కానీ అనిల్ రావిపూడి సినిమాలలో కథ కంటే ఎక్కువగా కథనం వేగంగా ఉంటుంది. మనోడు స్టోరీ మీద కంటే ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అందుకే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. నో లాజిక్.. ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్ కోసం అయితే మన శంకరవరప్రసాద్ గారు మనసుకి నచ్చేస్తారు. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం.. ఈ జనరేషన్ దర్శకులలో చిరంజీవిని ఆయన అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేదు. పాతికేళ్లు దాటిపోయింది మెగాస్టార్ ను అలా స్క్రీన్ మీద చూసి. అన్నయ్య సినిమాలో ఇలాంటి కామెడీ టైమింగ్ చూసాము. ఆ తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్స్ చిరంజీవి ఇచ్చాడు కానీ.. ఆ కామెడీ మాత్రం రాలేదు.. ఇన్నాళ్లకు ఆ లోటు అనిల్ తీర్చేశాడు. ఫస్టాఫ్ లోనే పైసా వసూల్ అయిపోయింది.. మెగా వింటేజ్ చమక్కులు.. ఆ పంచ్ డైలాగులు.. సెల్ఫ్ సెటైర్లు.. చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కొన్ని మోడ్యులేషన్స్.. ఏ ఒక్కటి వదలకుండా స్క్రీన్ మీద దించేశాడు….
చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడో అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.. తనకు కామిక్ క్యారెక్టర్ దొరికితే ఎలా రెచ్చిపోతాడో మరోసారి ప్రూవ్ చేశాడు మెగాస్టార్. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫ్ ఆడించాడు. ఒక్కొక్క సీనులో చిరంజీవి కామెడీ టైమింగ్ చూస్తుంటే ఘరానా మొగుడు గుర్తొచ్చింది. ఫస్టాఫ్ అయితే హిలేరియస్.. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగినట్టు అనిపిస్తుంది కానీ చివర్లో సెట్ అయిపోయింది. వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. చిన్న చిన్న సీన్స్ కూడా అనిల్ రావిపూడి రాసిన దానికంటే 100 రెట్లు ఇంప్రోవైజ్ చేశాడు చిరు. సింపుల్ గా చెప్పాలంటే శంకరవరప్రసాద్ గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు బాస్. లుక్స్ పరంగా కూడా చిరంజీవి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు.. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ విజువల్ గా అదిరిపోయాయి. చాలా సన్నివేశాలు చిరంజీవి పాత సినిమాలు నుంచి తీసుకొని రీ క్రియేట్ చేశాడు అనిల్. మరీ ముఖ్యంగా 90స్ లో వచ్చిన ఘరానా మొగుడు రిఫరెన్స్ ఎక్కువగా ఉంది. చిరంజీవి కూడా 30 ఏళ్ల తర్వాత అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఈ తరం దర్శకులలో ఆడవాళ్ళ సైకాలజీ అనిల్ రావిపూడి కంటే ఎవరికీ బాగా తెలియదు.. సెకండ్ హాఫ్ లో వాళ్లు సైకాలజీ మీద వచ్చే ఒక సీన్ భలే ఉంది…………..భార్యాభర్తలు విడిపోవడానికి బలమైన కారణాలు చూపనట్టే, వారు తిరిగి కలుసుకోవడానికి కూడా పెద్దంత డ్రామానేమీ అనిల్ రావిపూడి చూపించలేదు. హీరో తల్లి పాత్రలో భార్యభర్తల బంధం గురించి నాలుగు మంచి మాటలు చెప్పించారు. అయినా వాటిని మనసులోకి తీసుకోని హీరోయిన్ ఆ తర్వాత పరిణామాలతో భర్త వైపు మళ్ళినట్టు చూపించారు. అక్కడ మరింత బలమైన సన్నివేశం ఏదైనా రాసుకుని ఉండాల్సింది. అయితే… అనిల్ రావిపూడి దృష్టి మొత్తం మెగాభిమానుల్ని సంతృప్తిపర్చడం మీదనే ఉంటడంతో ఈ భావోద్వేగాల జోలుకు పెద్దంతగా పోలేదు. బలమైన విలన్ లేకపోవడం కూడా ఈ సినిమాకు సంబంధించి చిన్న లోటు.

చిరంజీవికి ఇలాంటి పాత్రలు చేయడమన్నది కేక్ వాక్. ఆయనలో సరికొత్త జోష్ ను నింపి… పాతికేళ్ళ క్రితం నాటి చిరంజీవిని అనిల్ రావిపూడి వెలికి తీసుకొచ్చాడు. తన మీద తనే జోకులు వేసుకుంటూ, అప్పడప్పుడూ అతి తెలివిని ప్రదర్శిస్తూ సహజమైన నటనతో చిరంజీవి ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలా బరువైన పాత్రలు చేసిన ఆయనకు ఇది ఓ ఆటవిడుపు. బహుశా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ పాత్రను ఆయన చేసి ఉంటారు. ఇప్పటికే చిరంజీవితో రెండు సినిమాలు చేసిన నయనతార ఇందులో బిజినెస్ మాగ్నెట్ కూతురుగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. చిరంజీవి టీమ్ మెంబర్స్ గా హర్షవర్థన్, కేథరిన్ థెస్రా, అభినవం గోమటం వినోదాన్ని పంచారు. శరత్ సక్సెనా, సచిన్ ఖేడేకర్, సుదేవ్ నాయర్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. మొన్న వచ్చిన ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ బామ్మగా నటించిన జరీనా వాహెబ్ ఇందులో చిరంజీవి తల్లి పాత్రను చక్కగా పోషించింది. వెంకీ గౌడగా వెంకటేశ్ ఇరగదీశాడు. ఇతర ప్రధాన పాత్రలను వీటీవీ గణేశ్‌, రఘుబాబు, శ్రీనివాస రెడ్డి, హరీశ్‌ పేరడి, నాగ మహేశ్‌, వడ్లమాని సాయి శ్రీనివాస్, వైవా హర్ష తదితరులు పోషించారు. గత యేడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అందరి మనసుల్ని దోచుకున్న మాస్టర్ రేవంత్ పవన్ సాయి ఇందులోనూ కామెడీని పండించాడు. ఎప్పటిలానే దర్శకుడు అనిల్ రావిపూడి… చిరు, వెంకీ డాన్స్ నంబర్ లో మెరుపులా మెరిశాడు.

సినిమా విడుదలకు ముందే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వంద మిలియన్లకు పైగా వ్యూస్ ను అందుకున్న ‘మీసాల పిల్ల’ పాట కంటే ‘హుక్ సాంగ్’ చిత్రీకరణ రీత్యా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. అలానే చిరంజీవి, వెంకీపై చిత్రీకరించిన ప్రీ క్లయిమాక్స్ సాంగ్ కూడా ఫుల్ ఎనర్జీతో సాగింది. భీమ్స్ అందించిన నేపథ్య సంగీతమూ బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ పర్ ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ మూవీని నిర్మించిన సాహు గారపాటి ఈ సినిమానూ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాడు. దీనికి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సైతం మరో నిర్మాత కావడం విశేషం. ఇందులో వెంకటేశ్ అతిథి పాత్ర చేయడంతో మూవీ రేంజ్ పెరిగింది. ఇది ఖచ్చితంగా కలెక్షన్స్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇక సంక్రాంతికి రాబోతున్న మిగిలిన మూడు చిత్రాలు ఎంత బాగున్నా కూడా… ‘మన శంకర్ వర ప్రసాద్’ రేంజ్ ను అవి అందుకోవడం కష్టమే. పండగకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేలా ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించాలి….