యూరియా కోసం రైతులు క్యూ లైన్లో ఉన్నారని పదే పదే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
యూరియా కోసం రైతులు క్యూ లైన్లో ఉన్నారని పదే పదే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులను గోస పెట్టారో రైతాంగానికి మొత్తం తెలుసు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో కూడా ప్రజలకు తెలుసు అన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు.
పంచాయతీ ఎన్నికలలో..
సిద్దిపేట, గజ్వేల్లో ఎరువుల కోసం క్యూ లైన్లు ఉన్న సందర్భాలు, క్యూ లైన్లలో రైతులు మృతి చెందిన సందర్భాలు మరిచారని, ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల సాంకేతిక సమస్యలతో ఏర్పడిన రద్దీని కూడా రాజకీయంగా వాడుకొనే పరిస్థితికి బీఆర్ఎస్ నేతలు వచ్చారని మండిపడ్డారు. రైతులు కొనుగోలు చేయకుండానే 7.60 లక్షల టన్నులు యూరియా ఈ యాసంగిలో అమ్ముడుపోయిందా? అని నిలదీశారు. వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు ఉందా? అని నిలదీశారు. పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు రైతులు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. మొక్కజొన్న వద్దు, కంది వద్దు, పత్తి వద్దు అనే పరిమితులు పెట్టారని, ఏవో పంటకాలనీలు అని, ఎరువులు ఫ్రీ అన్నారని ఏదీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.