భారత్ ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థను రూపొందించే సామర్థ్యం కలిగిన దేశం.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
భారత్ ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (ఏఐ) సంస్థను రూపొందించే సామర్థ్యం కలిగిన దేశమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో మాట్లాడిన ఆయన, అసాధారణ కంపెనీల ఏర్పాటుకు దేశంలోని పారిశ్రామిక, సాంకేతిక వ్యవస్థలు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, ఓయో వంటి స్టార్టప్‌ల విజయాలు భారత్ సరైన దిశలో ముందుకు సాగుతోందని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు వంటి నగరాలు ఆవిష్కరణల కేంద్రాలుగా ఎదుగుతున్నాయని, స్థానిక ఏఐ మోడళ్ల అభివృద్ధి దేశాన్ని అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా నిలబెడుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై విద్యార్థులు, నిపుణులతో సాంకేతిక సహకారం పెంపుపై చర్చించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ విస్తరణకు టెక్ దిగ్గజాలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఏఐ అంతరాన్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ ఈ దశాబ్దం చివరికల్లా 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. భారత్‌లో 2030 నాటికి రెండు కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వాల్కామ్ భారత స్టార్టప్‌లకు 150 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించగా, ఎన్విడియా భారత్‌ను కీలక ఏఐ ఆవిష్కరణ కేంద్రంగా పేర్కొంది. ఏజెంటిక్ ఏఐ తర్వాత మెషీన్ వాయిస్ టెక్నాలజీ ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. రాబోయే దశాబ్దంలో టెక్నాలజీ, ఏఐ ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ మార్కెట్ అవకాశాలు ఏర్పడనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గురించి
ఈ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూ ఢిల్లీలో జరుగుతోంది. 5 రోజులు పాటు జరిగే కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన అగ్ర నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలు పాల్గొంటున్నారు. ఇది గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న మొదటి పెద్ద అంతర్జాతీయ AI సమ్మిట్. ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాలు, 30కిపైగా అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతినిధులు, 45 మంది మంత్రులు హాజరవుతున్నారు. AI ఇండస్ట్రీ లీడర్లు, అకాడమిక్స్, టెక్ ఇన్నోవేటర్లు, సివిల్ సొసైటీ ప్రతినిధులు ఏఐకి సంబంధించిన ముఖ్య విషయాలు, భవిష్యత్తులో రాబోయే మార్పుల గురించి చర్చిస్తున్నారు. మనుషుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI for Humanity) అనే థీమ్ తో ఈ కార్యక్రమం జరుగుతోంది.