పొంగులేటి పై గవర్నర్‌ కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు..!

ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యథేచ్ఛగా నిబంధనలను కాలరాస్తూ, భూ కబ్జాలకు పాల్పడుతూ, అక్రమ మైనింగ్‌ చేస్తూ సర్కార్‌ సొమ్మును దిగమింగుతున్నారని నిప్పులు చెరిగారు…ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వాటా లు పంచుకుంటూ లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారితే ఇక ప్రజలకెవరు దిక్కని ఆవేదన వ్యక్తంచేశారు. పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అక్రమాలు చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొన్న ముఖ్యమంత్రి సభాసంఘం వేయమంటే పారిపోయారని దెప్పిపొడిచారు. అక్రమాలు నిగ్గుతేల్చాలని అడిగిన ప్రతిపక్షం గొంతునొక్కి డైవర్షన్‌ డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు.

మంత్రి పొంగులేటి భూ కబ్జాలు, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అక్రమ మైనింగ్‌పై సోమవారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం లోక్‌భవన్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ సాగిస్తున్న అరాచక పాలనపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీ నిబంధనలను తుంగలో తొక్కి జంటజలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌, అవుటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నదని ఆరోపించారు.

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి..

రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్‌పై బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆధారాలతో బట్టబయలు చేశారని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఆత్మరక్షణలో పడ్డ అధికారపక్షం ఎదురుదాడికి దిగి తప్పించుకున్నదని మండిపడ్డారు. అక్రమాలను ఒప్పుకొన్న సీఎం రేవంత్‌రెడ్డి సీబీసీఐడీ విచారణ చేయిస్తామనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర హోంమంత్రి కింద పనిచేసే పోలీసుల దర్యాప్తుతో ఒరిగేదేమీ ఉండదని స్పష్టంచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని పోలీసులు ప్రశ్నించడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అందుకే బీఆర్‌ఎస్‌ హౌస్‌ కమిటీ లేదంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, లేదంటే మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశామని గుర్తుచేశారు. కానీ తమ గొంతు నొక్కి, సభానాయకుడైన రేవంత్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడి.. అబద్ధాలు చెప్పి మభ్యపెట్టేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. రాఘవ అక్రమాలపై నిగ్గుతేల్చాలని అడిగితే అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మండలిలో ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను సైతం బయటకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలకుడు కాదు. బ్లాక్‌ మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ను రూట్‌ టూ ఇన్‌కంగా మార్చుకున్న ఘనుడు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పినట్టే ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తెచ్చిండు. ప్రజాపాలన పేరిట నిర్బంధ పాలన నడుపుతున్నడు.