తనపై దాడి చేశారంటూ పాడేరు పాస్టర్ ఆడిన డ్రామాలు పోలీసులు బయటపెట్టారు.ఎక్కడ, ఎలా దాడి చేయాలి,సీన్ ఎలా క్రియేట్ చేయాలి అనే అంశాలపై ముందే ప్లాన్ చేసుకున్న ఆడియో సంభాషణలను, ఒక నిందితుని భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులు సేకరించారు. నిజానికి ఎలాంటి గాయాలు కాకపోయినా, హత్యాయత్నం జరిగినట్లు నమ్మించేందుకు చిన్న గాయం చేసుకుని ఈ డ్రామా ఆడారు. సమాజంలో అపోహలు సృష్టించేలా, వివిధ మతాల మధ్య వైషమ్యాలు పెంచేలా చేసిన ఈ దాడి డ్రామాను పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకున్నారు.ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, దీని ప్రధాన లక్ష్యం ఏంటి, వీరికి ఎవరెవరు సహకరించారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
డ్రామా వేషాలు… అడ్డంగా దొరికిపోయారు.
కడపకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్పై పాడేరులో దాడి జరిగిందంటూ వచ్చిన వార్తలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. పాస్టర్ అభినయ్ తన అనుచరులతో కలిసి ఈ దాడి డ్రామాను చిత్రీకరించినట్టు ఆధారాలతో సహా దొరికిపోయాడు.
ఈ కుట్రకు సంబంధించి నిందితుల మధ్య నడిచిన ఆడియో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ చాట్లు, ఇతర సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు బలమైన సాక్ష్యాలు లభించాయి. అభినయ్తో పాటు మరో ఆరుగురు కలిసి ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు తేలింది. అసలు ఇంత పెద్ద దాడి డ్రామా వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.