Plastic Currency : ఇక చిరిగిపోవు.. మురికి …
మన జేబులో ఉండే పది, ఇరవై రూపాయల నోట్లు కొద్దిరోజులకే నలిగిపోవడం, మురికిగా మారడం లేదా చిరిగిపోవడం మనమంతా రోజూ చూసేదే. అయితే, ఈ చిరిగిన నోట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త అడుగులు వేస్తోంది. ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చించి కాగితపు నోట్లను ముద్రించడం, అవి పాడైపోతే మళ్లీ మార్చడం ఆర్‌బీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే, దశాబ్ద కాలం నాటి ‘పాలిమర్’ (ప్లాస్టిక్) నోట్ల ప్రతిపాదనను కేంద్ర బ్యాంక్ మళ్లీ తెరపైకి తెచ్చింది. త్వరలోనే తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లతో ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినా, చేతిలో నగదు వాడకం రికార్డు స్థాయికి చేరిన ఈ సమయంలో ఈ మార్పు సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం..
కాగితం నోట్లలాగే ఉంటాయ్
చాలామంది ప్లాస్టిక్ నోట్లు అనగానే క్రెడిట్, డెబిట్ కార్డుల్లా గట్టిగా ఉంటాయేమో అనుకుంటారు. కానీ, ఇవి కాటన్ పేపర్‌కు బదులుగా పాలిమర్ అనే సన్నని, ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారవుతాయి. ఇవి తేలికగా ఉండి, కాగితం నోట్ల లాగే మడతపెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఈ నోట్ల వల్ల ప్రభుత్వానికి లాభమేంటో వివరిస్తూ బ్యాంకింగ్ రంగ నిపుణులు ఒక కీలక విషయాన్ని స్పష్టం చేశారు.
“కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు కనీసం మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. వీటికి మురికి అంటదు, నీటిలో తడిచినా పాడవవు, చిరగవు. దీనివల్ల ప్రతి ఏటా కొత్త నోట్ల ముద్రణ కోసం పెట్టే వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది.”
ఈ నిర్ణయం వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (FY25) కొత్త నోట్ల ముద్రణ కోసమే ఆర్‌బీఐ ఏకంగా రూ. 6,372.8 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. మరోవైపు, మార్కెట్లో మురికిగా మారిన 23.8 బిలియన్ నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుని ధ్వంసం చేయాల్సి వచ్చింది. ఇందులో రూ. 500, రూ. 100 నోట్లే ఎక్కువ. దేశంలో కరెన్సీ చలామణి రికార్డు స్థాయిలో రూ. 42.86 ట్రిలియన్లకు చేరడంతో, నోట్ల జీవితకాలాన్ని (Shelf Life) పెంచడం మినహా ఆర్‌బీఐకి మరో మార్గం లేకుండా పోయింది.