ఆర్సీబీ క్రికెట్ ఫ్యాన్స్ నడిరోడ్ పై రచ్చ..

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ విక్టరీ పరేడ్ నిర్వహిస్తుందా? అనే చర్చ మొదలైంది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత గతేడాది ఆర్సీబీ తొలిసారి కప్పును ముద్దాడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏర్పాటు చేసిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఆ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో ఈ ఏడాది విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చింది. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఆర్సీబీ ఓ కీలక సందేశాన్ని విడుదల చేసింది..

ఆర్సీబీ రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఇది ఎంత అద్భుతమైన రాత్రి.. ఎంత గొప్ప అనుభూతి! ఆర్సీబీ అభిమానులందరికీ అభినందనలు. ఇది మీ విజయం. సంబరాలు చేసుకోండి కానీ ఆ సమయంలో బాధ్యతగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఇంట్లోనే ఈ విజయాన్ని ఆస్వాదించండి. ఈ ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆనందించండి. వచ్చే ఏడాది తిరిగి స్టేడియంలో కలుద్దాం. అప్పటివరకు ఈ ఆనందాన్ని పంచుకుంటూ మాకు మద్దతుగా నిలవండి’ అని ఆర్సీబీ ఎక్స్‌లో పేర్కొంది. దీంతో ఈ ఏడాది ఆర్సీబీ విక్టరీ పరేడ్ నిర్వహించడం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

గతేడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. భారీస్థాయిలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈసారి ఫ్రాంచైజీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటన కారణంగానే చిన్నస్వామిలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మార్చిన సంగతి తెలిసిందే..

హైదరాబాద్ లో గతరాత్రి నడిరోడ్లో రచ్చ చేసిన ఆర్సీబీ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ పై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీలతో బాది పారేశారు. నడిరోడ్డుపై ట్రాఫిక్ ఆపేసి, చొక్కాలు విప్పేసి వీరంగం చేస్తున్న వారిని తరిమి, తరిమి కొట్టారు. ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబి జట్టు గెలవడంతో ట్యాంక్ బండ్,. సచివాలయం దగ్గర చేరి హంగామా చేశారు. సంబరాలు శృతి మించడంతో పోలీసులు తరిమి తరిమి కొట్టారు..

కర్నూల్ లో కూడా RCB ఫ్యాన్స్ రచ్చ చేస్తూ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అద్దాలు పగలగొట్టడంతోపాటు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన పారికేట్లను కూడా పడవేసి నానాహంగా సృష్టించారు…