ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి.. పార్శిల్ పంపిస్తాం…కవిత..

ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి.. పార్శిల్ పంపిస్తామని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రాష్ట్ర సేన కార్యాలయంలో ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏపీ పాలకులపై నిప్పులు చెరిగారు. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ వారి సంస్కృతిని రుద్దుతామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలతాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్‌కు చురకలు.

ఆంధ్రాలో రాజధాని కట్టటం చేతకాకే ప్రస్తుతం తెలంగాణ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ తెలంగాణ సీఎంగా ఉండటంతో వారి డ్రామాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. ముందు తమ సెక్రటేరియేట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోవాలని కవిత సూచించారు. ఆ తర్వాత తెలంగాణలో జనసేన సభ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. అటు తెలంగాణలో టీడీపీని విస్తరిస్తామని మహానాడులో లోకేశ్ ప్రకటించడాన్ని సైతం కవిత తప్పుపట్టారు. ఇదేమి మీ బాబు సామ్రాజ్యం కాదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.