మొత్తానికి అఖిల్ అక్కినేని లెనిన్’ మూవీ తో బోణీ కొట్టినట్టేనా..!

మొత్తానికి అఖిల్ అక్కినేని బోణీ కొట్టినట్టేనా.. ఆయన ఖాతాలో మొదటి హిట్ పడిందా?..

అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ మూవీ విడుదలై మూడేళ్ళు గడిచిపోయింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడాలంటే ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టిన కసితో కాస్తంత గ్యాప్ తీసుకుని అఖిల్ ‘లెనిన్’ మూవీ చేశాడు. ‘వినరో భాగ్యం విష్ణు కథ’ ఫేమ్‌ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించిన ‘లెనిన్’ను అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మరి రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా…

ఇది చిత్తూరు సమీపంలోని చంద్రగిరి నియోజక వర్గం శ్రీరామపురంలో దాదాపు పాతికేళ్ళ క్రితం జరిగిన కథ. ఆ గ్రామంలో భారతం మిట్ట పేరుతో ప్రతి యేడాది ద్రౌపది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఊరిలో ఎవరి ఒంటి నుంచి చుక్క నెత్తురు నేల మీద పడకూడదనేది ఆచారం. అక్కడ పెద్దరికం అంతా నాదముని భార్య జయంతి (ఈశ్వరీరావు) దే. అనాథగా ఆ ఊరిలోకి అడుగు పెట్టిన లెనిన్ (అఖిల్ అక్కినేని) ను ఆమె చేరదీసి, తన కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో పాటే పెంచి పెద్ద చేస్తుంది. లెనిన్ కు యుక్త వయసు వచ్చిన తర్వాత మావ వరస అయ్యే నీలకంఠం (రాంకీ) రెండో కూతురు భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమలో పడతాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో అనుకోని అవాంతరాలు పరాయి వాళ్ళ నుంచే కాదు అయినా వాళ్ళ నుంచి కూడా ఎదురవుతాయి. ఆ గ్రామంలో పైకి కనిపించని మహా భారత యుద్ధమే సాగుతూ ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు, కుయుక్తులకు లోటు ఉండదు. ఇది నా గ్రామం అనుకున్న లెనిన్ కు అక్కడ ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? జైలుకు వెళ్ళిన అతను బెయిల్ పై వచ్చిన తర్వాత తన పగ, ప్రతీకారాలను ఎలా తీర్చుకున్నాడు? అనేది మిగిలిన కథ.

మహా భారతంలో అధికారం కోసం అన్నదమ్ములు సాగించిన కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ప్రతి పాత్ర వెనుక డార్క్ షేడ్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇందులో పాజిటివ్ క్యారెక్టర్స్ కంటే నెగెటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ. ప్రతి పాత్రకు ఓ బలమైన నేపథ్యాన్ని రాసుకోవడంలో దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు సక్సెస్ అయ్యాడు. దాంతో ఇందులో చేసిన ప్రతి పాత్రకూ ఓ గుర్తింపు లభించింది. సినిమా ప్రారంభంలోనే కడప సెంట్రల్ జైలు నుంచి హీరో బెయిల్ పై బయటకు రావడంతో ఆడియన్స్ తో ఉత్సుకత పెరుగుతుంది. హీరో ఎందుకు జైలుకు వెళ్ళాల్సి వచ్చిందనేది చెప్పకుండా ఇంటర్వెల్ వరకూ దర్శకుడు కథను బాగానే నడిపించాడు. హీరో శత్రువులంతా ఒకచోటకు చేరిన తర్వాత అతను వారిపై పగ తీర్చుకోవడమే ఇక మిగిలింది అనుకుంటూ ఉండగా, మళ్ళీ కథలోని పాత్రలు, వాటి నిజస్వరూపాలను తెలియజేసుకుంటూ ద్వితీయార్థాన్ని ప్రారంభించాడు. అప్పటి వరకు పాజిటివ్ గా ఉన్న పాత్రల్లోని గ్రే షేడ్స్ బయట పెట్టడంతో వాటిని జీర్ణించుకోవడానికి ప్రేక్షకులకు కాస్తంత టైం పడుతుంది. అలా ఊహించని మలుపులతో కథను క్లయిమాక్స్ వరకూ తీసికెళ్ళిన దర్శకుడు హీరోకి ఉన్న ఓతను రివీల్ చేసి ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తాడు. అయితే… సాధారణ తెలుగు సినిమాల్లోని హ్యాపీ ఎండింగ్ ఇందులో పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు భారీగానే థియేటర్ నుంచి బయటకు వస్తారు.

నటినటుల విషయానికి వస్తే… అఖిల్ అక్కినేని తన పాత్రను చాలా బాగా చేశాడు. నిజానికి ఇప్పటి వరకూ అతను ఏ పాత్ర పోషించినా… దానికి తగిన న్యాయం చేయడానికి కృషి చేస్తూనే ఉన్నాడు. పాత్ర కోసం అఖిల్ ఎంత కష్టపడతాడో ‘ఏజెంట్’ సినిమా టైమ్‌లో అందరికీ అర్థమైంది. కాకపోతే ఇంతవరకూ అతనికి కాలం కలిసి రాలేదు. ఈ సినిమా కోసం కూడా అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. రాయలసీమ యాసనూ బాగానే అనుకరించాడు. భాగ్యశ్రీ బోర్సే తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది. ఆమెదీ ప్రాధాన్యమైన పాత్రే. ఈ సినిమాలో వీరిద్దరి తర్వాత చెప్పుకోవాల్సింది వసంత్ పాత్ర పోషించిన ప్రమోద్ పంజు గురించి. ప్రభాస్ నటించిన ‘సలార్’లో ఇతనో కీలక పాత్ర పోషించాడు. అయితే… పాపులర్ తెలుగు ఆర్టిస్టులను ఈ పాత్రకు తీసుకుని ఉంటే బాగుండేది. ఇతర కీలక పాత్రలను ఈశ్వరీరావు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్‌, శత్రు, రాంకీ, వడ్లమాని సాయి శ్రీనివాస్‌, గెటప్ శ్రీను, ప్రవీణ్‌ పోషించారు…

అక్కినేని నట వారసుడు అఖిల్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు హిట్టు మొహం చూడని అఖిల్‌ వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మాస్ ఆడియన్స్‌ను పూర్తిస్థాయిలో మెప్పించే సరైన సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈసారి తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించాలని అఖిల్ భారీ గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ (Lenin) పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి…మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ సినిమా పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందినట్లు ప్రేక్షకులు చెప్తున్నారు…

తమన్ స్వరపర్చిన పాటలు ఏమంత పాపులర్ కాలేదు. నేపథ్య సంగీతం ఓకే. దాదాపు సినిమా అంతా జాతర నేపథ్యంలోనే జరగడంతో ప్రతి ఫ్రేమ్‌లోనూ యాభై, వంద మంది వరకు ఉంటోంది. ఖర్చు విషయంలో నాగార్జున, నాగవంశీ రాజీ పడలేదని తెలుస్తూనే ఉంది.