తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు.. !

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు.. జలాశయాలకు భారీ వరదలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్‌తో పాటు మొత్తం 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ బుధవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలవొద్దని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేముందు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాలకు భారీగా నీరు చేరుతోంది. తుంగభద్ర ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, జూరాల ప్రాజెక్టుకు సుమారు 2.44 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. 33 గేట్లు ఎత్తి 2.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 50 శాతానికి పైగా నిండగా, నాగార్జునసాగర్‌కు ప్రస్తుతం 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పట్టి నీటిమట్టం 26 అడుగుల వద్ద కొనసాగుతోంది. కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ 1.37 లక్షల క్యూసెక్కులుగా నమోదవగా, 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.
పాలమూరు జిల్లాలో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుండగా, గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద నది అందాలను తిలకించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిర్నపల్లిలోని జానకీబాయి చెరువు అలుగు పోస్తూ జలపాతాన్ని తలపించేలా మారడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.
దేశవ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణా, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కొంకణ్, గోవా రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కాన్పూర్, హరిద్వార్, ఫతేపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి.
ఇదిలా ఉండగా, వాతావరణ మార్పుల ప్రభావంతో పెరుగుతున్న తీవ్ర వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వడగాలులు, పిడుగుపాట్లను ప్రకృతి విపత్తుల జాబితాలో చేర్చినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీంతో ఇలాంటి ఘటనల్లో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్రాలు విపత్తు సహాయ నిధులను వినియోగించుకునే అవకాశం లభించనుంది.