పెళ్లిచూపులకు వెళ్లే ముందు హిందూ దేవుళ్ల ఫొటోలు పెట్టుకుని డ్రామా ఆడారు.. జోగి రమేష్ కోడలు మేఘన..

పెళ్లిచూపులకు వెళ్లే ముందు హిందూ దేవుళ్ల ఫొటోలు పెట్టుకుని డ్రామా ఆడారు..

మా మతంలోకి రావాలని నన్ను తీవ్రంగా బలవంతం చేశారు…

వాళ్లు ఏ మతం మార్చుకున్నా పర్లేదు.. కానీ నా మతాన్ని తక్కువ చేశారు

FIR లో ప్రస్తావించిన అంశాలను బయటపెట్టిన జోగి రమేష్ కోడలు మేఘన..

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికీ, కోడలు మేఘనకూ (Meghana) మధ్య జరుగుతున్న వార్ తాజాగా బయటపడుతోంది. జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ , క్రైస్తవులని చెప్పకుండా తనతో పెళ్లి జరిపించి మోసం చేశారంటూ ఆయన కోడలు మేఘన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోగి రమేశ్ తో పాటు మొత్తం 10 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారంపై జోగి రమేశ్ వివరణ ఇవ్వగా.. దానికి కౌంటర్ గా ఆయన కోడలు మేఘన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని షాకింగ్ అంశాలు బయటపెట్టారు.ఇలాంటి రోజు వస్తుంది, ఆడపిల్లగా ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉందని జోగి రమేశ్ (Jogi Ramesh) కోడలు మేఘన తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డానన్నారు. ఈరోజు ఈపరిస్థితులను దైర్యంగా ఎదుర్కొన్నందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు తెలిపారు. జోగి రమేష్ , వారి కుటుంబ సభ్యులు తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది మే నెలలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తో తనకు పెళ్లి చేశారని, తన తండ్రి సంతోషం కోసం ఎంతో కష్టపడి ఈ పెళ్లి జరిపారన్నారు. జోగి రమేష్ మీద నమ్మకంతో వారింటికి కోడలుగా పంపారన్నారు. కానీ కొన్ని రోజులకే నన్ను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారని మేఘన ఆరోపించారు.పెళ్లికి ముందు హిందువులం అని చెప్పి పెళ్లి చేశారని, కానీ వారి కుటుంబం మొత్తం క్రిస్టియన్స్ అని, ఇంట్లో హిందూ పూజలు అస్సలు చేయరని తెలిపారు. తనకు చిన్న నాటి నుంచి హిందూ పూజలు చేయడం అలవాటని వివరించారు. అత్తవారింటికి వెళ్లిన తర్వాత కూడా ఒక్క హిందూ దేవుళ్ల ఫొటో కూడా లేదన్నారు. తాను దేవుళ్ల పొటో తెచ్చి పూజ చేస్తుంటే అడ్డుకుని కొట్టారన్నారు. ఎవరి నమ్మకం వాళ్లది, కానీ తమకు క్రిస్టియన్ మతం తీసుకున్నట్లు కూడా చెప్పలేదని తెలిపారు. ఇది మోసమే అన్నారు.

ఇదే సమయంలో తన కోడలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయానికి వెళ్లిన వీడియోలను ప్రస్తావిస్తూ ఈ పర్సనల్ మ్యాటర్‌ వెనుక రాజకీయ జోక్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. సరైన సమయంలో వాటన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ఎన్టీఆర్, అక్కినేని వంటి పెద్ద పెద్ద ప్రముఖుల కుటుంబాల్లోనూ వ్యక్తిగత సమస్యలు ఉండవా అని ప్రశ్నించిన జోగి రమేష్.. తనలాంటి బీసీ నాయకుడిని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ స్థాయి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని నిలదీశారు.

కుటుంబ సమస్యను కుటుంబ పరిధిలోనే లేదా చట్టపరంగా ముగించుకోవాల్సి ఉండగా.. దానిని బహిరంగ చర్చగా మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో ఇరు వర్గాల వాదనలు.. పోలీసుల సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.