మధ్యప్రదేశ్లోని లవ్ఖుష్నగర్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు. అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్లో జబల్పూర్కు తరలించారు…
మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లా లవ్ కుష్ నగర్ లో అరుదైన ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆగస్టు 23 న ఓ మహిళ ప్రసవించింది. అయితే పుట్టిన ఆ మగ శిశువును చూసి అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడే పుట్టిన ఆ శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆ శిశువును చూసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శిశువు ఛాతీ భాగం నుండి ఈ అదనపు అవయవాలు పెరిగినట్లు గుర్తించారు.
అయితే ఇది హెటిరోపాగస్ కన్జాయిన్డ్ ట్విన్స్ లేదా పరాశైట్ ట్విన్నింగ్ అనే అరుదైన జన్యులోపమని వైద్యులు నిర్ధారించారు. ఒక శిశువు పూర్తిగా అభివృద్ధి చెందగా, అసంపూర్ణంగా ఉన్న మరో శిశువు శరీర భాగాలు (అదనపు చేతులు, కాళ్లు) మొదటి శిశువుకు అతుక్కుని ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే మెరుగైన వైద్య సహాయం కోసం శిశువును జబల్ పూర్ కు తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం శిశువు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. శిశువుకు అదనంగా ఉన్న కాళ్లు, చేతులను శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశాలను వైద్యుల బృందం పరిశీలిస్తోంది.