74 టన్నుల నిషేధిత చేపలు పూడ్చివేత..!

74 టన్నుల నిషేధిత చేపలు పూడ్చివేత

నాగ్‌పూర్‌లో మత్స్యశాఖ భారీ ఆపరేషన్‌.. మూడు నెలల్లో 164 టన్నుల థాయ్‌ మాంగుర్‌ సీజ్‌

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో నిషేధిత థాయ్‌ మాంగుర్‌ చేపల పెంపకంపై మత్స్యశాఖ అధికారులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా అనుమానాస్పదంగా ఉన్న రహస్య చెరువులను గుర్తించి అధికారులు దాడులు నిర్వహించారు.

తాజా తనిఖీల్లో భారీగా నిల్వ ఉన్న 74 టన్నుల నిషేధిత థాయ్‌ మాంగుర్‌ చేపలను అధికారులు స్వాధీనం చేసుకుని, గోతుల్లో పూడ్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ చేపలను పెంచుతున్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.

గత మూడు నెలల్లో నిర్వహించిన వరుస దాడుల్లో ఇప్పటివరకు 164 టన్నుల నిషేధిత థాయ్‌ మాంగుర్‌ చేపలను సీజ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిషేధిత చేపల పెంపకం, విక్రయాలను అడ్డుకునేందుకు తనిఖీలు కొనసాగుతున్నాయి.