వేపచెట్టు నరికి వేత విషయంలో వివాదం… సొంత తండ్రితో పాటు మరో వ్యక్తి హత్య..!

సూర్యాపేట జిల్లా:..

మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో వేపచెట్టు వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఇంటి పక్కన ఉన్న వేపచెట్టును అమరబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ తొలగించడంతో వివాదం తలెత్తినట్లు సమాచారం.

ఈ క్రమంలో భూక్య రాము నాయక్, అతని అన్న పెద్దబాబు నాయక్ కలిసి గొడ్డలితో దాడి చేయడంతో అమరబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రామ్ నాయక్ తండ్రి సైదాపైనా దాడి జరగడంతో ఆయన కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ రెండు హత్యలకు సంబంధించి గ్రామస్తులు అడిగి సమాచారం తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు…

చెట్టువివాదాన్ని కావాలనే పెద్దది చేశారంటున్న గ్రామస్తులు…

*ప్రత్యక్ష సాక్షులు, , తండా వాసుల కథనం ప్రకారం*..

రామ్ నాయక్, పెద్దబాబు నాయక్‌లు గతంలో కూడా తరచూ వివాదాలు పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవారని ఆరోపించారు. ఎదుటివారితో గొడవలు సృష్టించడం, కేసులు పెట్టడం అలవాటుగా మారిందని తెలిపారు.

వేపచెట్టు విషయంలో జరిగిన గొడవను కావాలనే పెద్దది చేసి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వెంకటేశ్వర్లు యాదవ్‌పై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. అనంతరం తమపై కేసులు పడకుండా ఘటనను మరో విధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పలువురు గ్రామస్తులు తెలిపారు.

ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తండావాసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ముగ్గురు అదుపులో.. పోలీసుల విచారణ

కేసుకు సంబంధించి భూక్య రామ్ నాయక్, అతని అన్న పెద్దబాబు నాయక్, వారి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యల వెనుక అసలు కారణాలు, ఘటనలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

*కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ*..

వేపచెట్టు విషయంలో కావాలనే గొడవను పెద్దది చేసి వెంకటేశ్వర్లు యాదవ్‌ను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా తమకు సమాచారం ఉందన్నారు. అదే ఘటనలో సొంత తండ్రి సైదా కూడా మృతి చెందినట్లు తెలిపారు.

రామ్ నాయక్, పెద్దబాబు నాయక్‌లపై గతంలో కూడా వివాదాలు, కేసులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. చిన్నచిన్న విషయాలకే కేసులు పెట్టడం, గ్రామంలో వివాదాలు సృష్టించుకోవడం వంటి అంశాలపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, హత్యల్లో ఎవరి ప్రమేయం ఉన్నా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు.

*గ్రామంలో పోలీస్ పికెటింగ్*

ఘటన నేపథ్యంలో ఎర్రగట్టుతండాలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను మోహరించి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

తండావాసులు మాత్రం హత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు…