తండ్రి లేని బిడ్డ.. కూలీ తల్లి కల – చూపు మాత్రం జాతీయ స్థాయి కబడ్డీ వైపు రామావత్ నందిని
కూలి తల్లి చెమట చుక్కల్లోంచి డివిజన్ కబడ్డీ వరకు.. లక్ష్యం మాత్రం జాతీయ జెండా!
దేవరకొండ………
దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో పుట్టిన గిరిజన విద్యార్థిని రామావత్ నందిని కథ హృదయాన్ని కదిలిస్తుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఇంటికి దిక్కులేని పరిస్థితి.
అయినా తల్లి శాంతి కుంగిపోలేదు. బిడ్డ భవిష్యత్తు కోసం ఎండనకా వాననకా రోజువారీ కూలీ పనికి వెళుతూ, రెక్కలు ముక్కలు చేసుకుంటూ కూతురిని చదివిస్తోంది.
నందిని ప్రస్తుతం దేవరకొండ మోడల్ కాలేజీలో చదువుతోంది. చదువుతో పాటు స్కూల్ గేమ్స్ కబడ్డీలో తన ప్రతిభను కనబరిచి డివిజన్ లెవెల్ కి సెలెక్ట్ అయింది. కళాశాల యాజమాన్యం, లెక్చరర్లు తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని నందిని ఆనందంగా చెబుతోంది.
“నా మనసంతా జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడాలనే ఉంది” అంటూ తన ఆశయాన్ని చెబుతోంది నందిని.
తండ్రి లేని లోటును గుండెల్లో దాచుకుని, తల్లి కష్టాన్ని కళ్లలో పెట్టుకుని ముందుకు సాగుతున్న నందిని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఈ సందర్భంగా భవిష్యత్ ప్రజాపాలన యాజమాన్యం నందినికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించింది. ఇలాంటి ప్రతిభ కలిగిన పేద విద్యార్థినికి ప్రభుత్వం చేయూతనివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.