మఠంపల్లి ఎమ్మార్వో కార్యాలయం తరలింపు ప్రక్రియ నిలిపివేయాలి..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయ తరలింపుపై వ్యతిరేకత.

ప్రస్తుత స్థానంలోనే భవనం నిర్మించాలంటూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత.

దూర ప్రాంతానికి మళ్లిస్తే ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడతారన్న నాయకులు

స్పందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన జేఏసీ మరియు అఖిలపక్ష నాయకులు..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి నూతన తాసిల్దార్ భవనం మంజూరు కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నూతన భవనాన్ని వేరే ప్రదేశానికి మార్చే సన్నాహాలు జరుగుతుండటంపై స్థానిక ప్రజలు, వివిధ సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో *మఠంపల్లి మండల ఎమ్మార్పీఎస్ జేఏసీ మరియు అఖిలపక్ష నాయకులు* కలిసి మంగళవారం స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా *ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కాంపాటి సందీప్ మాదిగ మాట్లాడుతూ*.. ప్రస్తుతం కార్యాలయం ఉన్న ప్రాంతంలో కాకుండా, వేరే దూర ప్రాంతంలోని ఇటుక బట్టీల వద్ద నూతన భవనాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా చేస్తే సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు, దివ్యాంగులకు మరియు కార్మికులకు రాకపోకల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న చోటే భవనాన్ని నిర్మిస్తే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బచ్చలకూరి ప్రసాద్, జేఏసీ జిల్లా కార్యదర్శి మాజీ ఉప సర్పంచ్ జాల కిరణ్, బాలు నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నందిపాటి సోమయ్య తదితరులు మాట్లాడుతూ.. అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి తాసిల్దార్ కార్యాలయ తరలింపు నిర్ణయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని, స్థానికులు కోరుకుంటున్న విధంగా యథావిధిగా ప్రస్తుతమున్న చోటే నూతన భవనం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో పాటు ఆరాల సైదులు, రాజు తదితర వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.