ఈవీఎం లు తీసివేయాలి..బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి..మాయావతి.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటింగ్‌ను వెంటనే నిలిపివేసి, బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు..ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె అన్నారు.

లక్నోలో సోమవారం మీడియాతో మాట్లాడిన మాయావతి.. ఎన్నికలు నిర్వహించే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల సంఘానికి అప్పగించిందని చెప్పారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా పార్లమెంట్ చట్టాలు, నిబంధనలు రూపొందించిందని తెలిపారు. ప్రతి వ్యక్తి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే హక్కు కలిగి ఉండాలని, తాను వేసిన ఓటు అదే అభ్యర్థికి చేరి, లెక్కింపులోనూ అదే అభ్యర్థికి జమ కావాలని అన్నారు.

ఓటు వేరే వ్యక్తి ఖాతాలోకి వెళ్లిందా? అనే అనుమానం ఓటరుకు రాకూడదని మాయావతి చెప్పారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లుగా మారుతుందని, తీవ్రమైన నేరం కింద పరిగణించాల్సి వస్తుందని అన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు..దేశంలో తొలి ఎన్నికల తర్వాత దాదాపు 5 దశాబ్దాల పాటు బ్యాలెట్‌ పేపర్లనే ఉపయోగించారని మాయావతి గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్‌ పేపర్లు తెరిచి ఓట్లను లెక్కించేవారని తెలిపారు. అనంతరం ఎన్నికల సంఘం బ్యాలెట్‌ పేపర్ల స్థానంలో ఈవీఎంలను వినియోగించడం ప్రారంభించిందన్నారు.

అప్పట్లో బీజేపీ వ్యతిరేకించింది..
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఈవీఎంలను వ్యతిరేకించిందని మాయావతి ఆరోపించారు. యంత్రాల్లోని ఎలక్ట్రానిక్ చిప్‌ను హ్యాక్ చేయవచ్చని ఆ పార్టీ అప్పట్లో చెప్పిందని, దీనిపై పుస్తకం కూడా ప్రచురించిందని ఆమె పేర్కొన్నారు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈవీఎంల వినియోగాన్ని కొనసాగించిందని విమర్శించారు.

బహుజన్ సమాజ్ పార్టీ మొదటి నుంచే ఈవీఎంల ఆధారిత ఓటింగ్‌ను వ్యతిరేకిస్తోందని మాయావతి చెప్పారు. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలకు చెందిన ఓటర్లలో ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం తగ్గుతోందని ఆమె పేర్కొన్నారు. నాగినా రిజర్వ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ విజయం వెనుక ఈవీఎంలను భారతీయ జనతా పార్టీ తారుమారు చేసిన కుట్ర ఉందని కూడా మాయావతి ఆరోపించారు.