మయన్మార్‌లో వైమానిక దాడి.

నైపిడా – బంగ్లాదేశ్ సరిహద్దులను పంచుకునే, యుద్ధంతో దెబ్బతిన్న మయన్మార్ రాష్ట్రంలోని రఖైన్ రాష్ట్రంలోని ఒక మార్కెట్ సమీపంలో దాడి..

మయన్మార్‌లోని పశ్చిమ రఖైన్‌ రాష్ట్రంలో ఓ రద్దీగా ఉండే మార్కెట్ సమీపంలో సైన్యం జరిపిన వైమానిక దాడిలో 49 మంది మృతి చెందారు. మరో 58 మంది గాయపడ్డారు.మయన్మార్‌ సైన్యంపై పోరాడుతున్న అరాకాన్‌ ఆర్మీ, స్థానిక సహాయక సిబ్బంది ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుల్లో వ్యాపారులు, కొనుగోలుదారులు, పాదచారులు ఉన్నట్లు తెలిపారు.

క్యాక్టావ్‌ టౌన్‌షిప్‌లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అరాకాన్‌ ఆర్మీ ప్రకారం.. ఓ యుద్ధ విమానం స్థానిక మార్కెట్ సమీపంలో రెండు బాంబులు జారవిడిచింది. ఈ దాడిలో 49 మంది మృతి చెందగా.. 58 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు రఖైన్‌కు చెందిన సీనియర్‌ సహాయక అధికారి వై హున్‌ ఆంగ్‌ తెలిపారు. ఈ మార్కెట్‌ రఖైన్‌ రాష్ట్రంలో ప్రధాన టోకు వ్యాపార కేంద్రంగా ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు ఇక్కడికి వస్తుంటారని ఆయన చెప్పారు..దాడి అనంతరం భవనాలు దెబ్బతిన్నట్లు, వాహనాలు కాలిపోయినట్లు, సమీపంలోని వంతెనలోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న చిత్రాలు, వీడియోలు చూపిస్తున్నాయి. అయితే ఈ దాడికి సంబంధించిన వివరాలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదని వార్తా సంస్థలు తెలిపాయి. మయన్మార్‌ సైన్యం ఈ ఘటనపై వెంటనే స్పందించలేదు. సైన్యం గతంలో తమ వైమానిక దాడులు చట్టబద్ధమైన సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటాయని, సాయుధ ప్రతిఘటన బృందాలు ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయని ఆరోపించింది.

అయితే మార్కెట్‌ ప్రాంతంపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి భారీగా పౌరుల ప్రాణనష్టానికి కారణమైందని అరాకాన్‌ ఆర్మీ ఆరోపించింది. ఈ దాడులకు ప్రత్యక్షంగా బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై త్వరలో ప్రతీకార చర్యలు తీర్చుకుంటామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించింది. 2021 ఫిబ్రవరి 1న ఆంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని మయన్మార్‌ సైన్యం తొలగించినప్పటి నుంచి దేశంలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై భద్రతా బలగాల అణచివేతతో పలువురు ఆయుధాలు చేపట్టారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో జాతి ఆధారిత సాయుధ సంస్థలు తమ పోరాటాన్ని తీవ్రతరం చేశాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో సైన్యానికి, ప్రతిఘటన బలగాలకు మధ్య పోరాటం కొనసాగుతోంది.