నేటి లోకం తీరు …

నేటి లోకం తీరు .

భయం, ఆందోళన, ఒత్తిడి, గిల్టీ ఫీలింగ్, స్ట్రెస్ ఇవన్నీ మనలో ఉన్నంతకాలం మనం ఇతరులతో స్వేచ్ఛగా కలవలేము. కలిసినా మనస్ఫూర్తిగా, సంతోషంగా ఉండలేము. కాబట్టి ముందుగా వీటి నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ప్రతిరోజూ ఒక చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటాం. ఏదైనా కారణంగా నాలుగు రోజులు నీళ్లు పోయడం మరిచిపోతే, నీరు అందక ఆ చెట్టు ఎండిపోయే పరిస్థితికి వస్తుంది. ఆ సమయంలో మనం గమనించి వెంటనే నీళ్లు పోస్తాం.
మరుసటి రోజు ఉదయం,
“నేను నిన్న చెట్టుకు నీళ్లు పోశాను కదా… ఇంకా చెట్టు పచ్చగా ఎందుకు మారలేదు?” అని ఆలోచిస్తాం.
కానీ అక్కడ మనం చేసిన పెద్ద తప్పు ఏమిటంటే—చెట్టును సరిగ్గా పట్టించుకోకపోవడం.
ఒక్కరోజు నీళ్లు పోయడం వల్ల వెంటనే అది మళ్లీ పచ్చగా మారదు. దానికి సమయం, శ్రద్ధ, నిరంతర సంరక్షణ అవసరం.
అదే విధంగా మన జీవితంలో కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మనకు ఆత్మీయమైన వ్యక్తులు, రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు—వారితో మాటలు తగ్గిపోతే, పరస్పర అవగాహన తగ్గిపోతే సమస్యలు పెరుగుతాయి. దూరం పెరుగుతుంది. చివరికి బంధం కూడా బలహీనపడవచ్చు.
ఒకసారి బంధంలో దూరం ఏర్పడిన తర్వాత, తిరిగి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు మనలో ఆందోళన, ఒత్తిడి, గిల్టీ ఫీలింగ్, భయం రావచ్చు.
కానీ వాటికి లొంగిపోకుండా, మనసును ప్రశాంతంగా చేసుకుని, సమయం, సహనం, ప్రేమ, నిజాయితీతో మళ్లీ ఆ బంధాన్ని బలపరచడానికి ప్రయత్నించాలి.
ఎందుకంటే…

చెట్టుకు నీరు ఎంత అవసరమో, బంధాలకు ప్రేమ, మాట, సమయం అంతే అవసరం.

బంధాలు ఒక్కరోజులో ఏర్పడవు. ఒక్కరోజులోనే నిలబడవు. వాటిని నిలబెట్టుకోవడానికి నిరంతర శ్రద్ధ, పరస్పర గౌరవం, ప్రేమ అవసరం.
మనలోని భయం, ఆందోళన, ఒత్తిడి, గిల్టీ ఫీలింగ్‌లను దూరం చేసుకుని, మనస్ఫూర్తిగా మనుషులతో కలిసినప్పుడే మన జీవితం మరింత ప్రశాంతంగా, సంపూర్ణంగా మారుతుంది…శ్రద్ధ శ్రీ యోగాచార్యులు ఆయుర్వేద వైద్య నిపుణులు షేక్ బాహర్ అలీ ఖమ్మం..