ఆదివారం అమావాస్య..!..ఆచరించాల్సిన పద్దతులు..!

ఆదివారం అమావాస్య ఈ రెండు కలిసి వస్తే చాలా శక్తివంతమైనది

ఆరోజు చేసే పూజలు కాని పరిహారాలు కానీ కొన్ని వేల రెట్ల ఫలితాన్ని ఇస్తాయి

ఒక గాజు గ్లాస్ కానీ రాగి గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో నీటిని నింపి పచ్చ కర్పూరం వేసి అమావాస్య రోజున అంటే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజున ఇంట్లో వాకిలి లోపలవైపున ఒక మూలగా దీన్ని ఉంచుకుని తర్వాత రోజున ఈ నీటిని మొక్కల్లో పారపోయండి.

దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంట్లోకి లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది.

పుష్య మాసంలో చివరి రోజు, మహా శివరాత్రి కి కొద్ది రోజుల ముందు వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. దీనినే చొల్లంగి అమావాస్యగా కూడా చెప్తారు. సంవత్సరంలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. అందులో ఈ మౌని అమావాస్య కు చాలా ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అసలు ఏమిటి ఈ మౌని అమావాస్య ప్రత్యేకత, ఈ రోజు చేయవలసిన విధి విధానాలు వివరంగా మీ కోసం..మౌని అమావాస్య జనవరి 18 వ తారీకు ఆదివారం వచ్చింది. ఈ రోజు ఈ అమావాస్య తిథి తెల్లవారుజామున 12:03 నిమిషాలకు మొదలై, తరువాతి రోజు అనగా జనవరి 19వ తేదీ తెల్లవారుజామున 01:21 నిమిషాలకు వరకు ఉంటుంది. అమృత స్నానాలు ఆచరించడానికి ఉత్తమ సమయం ఉదయం 05:27 నుండి 06:21 నిమిషాలు.
ఈ రోజు తెల్లవారు జామునే లేచి చేసే స్నానం, దానం, జపం వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత ముఖ్యం. ఈ రోజు నదుల్లో, సముద్రాల్లో చేసే స్నానం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని హిందువుల విశ్వాసం. అందుకే దీనిని అమృత స్నానంగా పిలుస్తారు..ప్రయాగ రాజ్ త్రివేణి సంగమంలో ఈ రోజు లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే నదుల్లో స్నానాలు చెయ్యటం వీలుకాని వారు గంగాజలాన్ని నీటిలో కలుపుకుని ఇంట్లోనే తల స్నానాలు ఆచరించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ స్నానం సమయంలో పవిత్రనదులైన గంగా, గోదావరి వంటి నదుల పేర్లను మనసులో స్మరించుకుంటూ చేయటంవల్ల ఆ నదుల్లో స్నానాలు చేసినంత ఫలితముంటుంది పండితుల మాట. స్నానం చేసిన తరువాత సూర్యుడికి నమస్కరించి అర్ఘ్యం (నీటిని వదలడం) ఇవ్వాలి. మీకు తెలుసా ఈ మౌని అమావాస్య రోజే నాగ సాధువులకు దీక్ష ఇస్తారు..
పుణ్య స్నానాలకు మాత్రమే కాదు పితృ కార్యాలకు కూడా ఎంతో విశిష్టమైనది. ఈ రోజున చేసే తర్పణాలు, పిండ ప్రదానాలు నేరుగా మన పితృదేవతలకు అందుతాయని, తద్వారా పితృ దోషాలు తొలగి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకాల్లో పితృ దోషాలతో బాధలు పడేవారు, సంతానం కలగని వారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ మౌని అమావాస్య నాడు పితృకార్యాలు తప్పక చేయాలి. దీనివల్ల వారి దోషాలు తొలగి పెద్దల దీవెనలతో మంచి జరుగుతుంది. అయితే ఈ రోజు పిండ ప్రదానాలు చేయలేని వారు సూర్యోదయానికి ముందే స్నానం ముగించి, దక్షిణం వైపు దీపం వెలిగించాలని, కాకులకు, పక్షులకు వీధి కుక్కలవంటి మూగ జీవాలకు ఆహారాన్ని అందించాలని కూడా పండితులు చెప్తున్నారు. పితృదేవతల పేరుతో బ్రాహ్మణులకు లేదా పేదలకు స్వయంపాకాన్ని అందించాలి..

మానవజాతి మూల పురుషుడైన మనువు జన్మించిన ఈ రోజున పైన చెప్పినవి పాటిస్తే ఎంతో శుభకరం. ఈ రోజు మాంసాహారానికి దూరంగా ఉండి ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను త్యజించి మౌనంగా ఉండటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. శరీరాన్ని నదీ స్నానంతో, వాక్కును మౌనంతో శుద్ధి చేసుకునే ఈ అద్భుత అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959