విద్య, సమగ్ర శిక్షపై మంత్రి సమీక్ష..

ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్లో పూర్వ విద్యార్థిసంఘాలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారిని స్కూల్ మెంటార్లుగా వినియోగించుకునే వ్యవస్థను రూపొందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్య, సమగ్ర శిక్షపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధ్యాయులకు ఇప్పుడు 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్‌ను తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్స్ వంటి వ్యవస్థను తీసుకురావాలని, క్లస్టర్ స్థాయిలో సీఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అన్ని అంశాలు ఏకీకృతం చేసి ఒకే డ్యాష్ బోర్డ్ రూపొందించాలన్నారు. జీవో 117 ఉపసంహరణ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూళ్లను గరిష్టస్థాయిలో ఏర్పాటుచేసి ఒక క్లాస్ కు ఒక టీచర్ ను కేటాయించాలని, క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు….