ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా.. 8 చోట్ల ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 92 స్థానిక సంస్థల్లో ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు…
స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఇంజిన్’ పాలన సాధ్యమవుతుందని, అభివృద్ధి మరింత వేగంగా పరుగులు తీస్తుందని అధికార పక్షం భరోసా ఇస్తోంది. మరోవైపు, ప్రభుత్వ వైఫల్యాలు, విమర్శలు, ప్రజా సమస్యలనే ప్రధాన అస్త్రాలుగా మలచుకుని వైసీపీ ప్రచారంలో హోరాహోరీగా పోరాడింది.
రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో మొత్తం 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు), నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పురపోరులో అధికార కూటమి ఆరంభంలోనే స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటికే 17 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల ఛైర్పర్సన్ స్థానాలతో పాటు, ఎనిమిది చోట్ల వార్డులన్నింటినీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడపలో ఏడు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్పర్సన్ పోస్టులతో పాటు, కడప నగరపాలక సంస్థలోని 66 డివిజన్లకు గాను 52 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుని వైసీపీని తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో వైసీపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి తలెత్తింది. అయితే, పోరు హోరాహోరీగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇరు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతూ ఓటర్లను ఆకర్షించేందుకు పోటీపడ్డాయి. ముఖ్యంగా విజయవాడ, చీరాల, నెల్లిమర్ల, సాలూరులలో మేయర్, ఛైర్పర్సన్ స్థానాలకు త్రిముఖ పోటీ నెలకొంది…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే.. మున్సిపల్ ఎన్నికల్లో రెండు చోట్ల అభ్యర్థుల గుర్తుల తారుమారు తీవ్ర గందరగోళానికి దారితీసింది. బ్యాలెట్ పేపర్లు, డిస్ప్లే బోర్డులపై గుర్తులు తారుమారవడంతో అభ్యర్థులు, ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. అభ్యర్థుల ఫిర్యాదుతో అధికారులు వెంటనే కొత్త బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేస్తున్నారు..
విజయవాడ 55వ డివిజన్లో బ్యాలెట్ తారుమారు.
విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్ ముద్రణలో పొరపాటు జరగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది..బ్యాలెట్ పేపర్లో కాంగ్రెస్ అభ్యర్థికి వైఎస్సార్సీపీ (YSRCP) గుర్తును, అలాగే వైఎస్సార్సీపీ అభ్యర్థికి కాంగ్రెస్ గుర్తును ముద్రించారు. అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తప్పును గుర్తించి వెంటనే పోలింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కొత్త బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేసి సుమారు గంటసేపు ఆలస్యంగా పోలింగ్‌ను పునఃప్రారంభించారు. పోలింగ్‌కు ఎంత సేపు అయితే బ్రేక్ పడిందో.. అంత సమయం సాయంత్రం అదనంగా కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కేవలం ముద్రణ సమయంలో దొర్లిన చిన్న పొరపాటుపై అనవసరంగా రాజకీయం చేయవద్దని టీడీపీ నేతలు హితవు పలికారు..
ఎన్నికల బరిలో అనూహ్య పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థి
ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, కృష్ణా జిల్లాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కంకిపాడు మండలం ఈడుపుగల్లు-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న హిమబిందు, ఆరోగ్య కారణాల రీత్యా బరి నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించారు.
శనివారం తన నివాసంలో మాట్లాడిన హిమబిందు, ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వివరించారు. కొన్నేళ్లుగా తాను గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు కోరడంతో ఇటీవల ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తుండగా మరోసారి గుండెనొప్పి రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు వివరించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారని, వారి సలహా మేరకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు తనపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అనారోగ్య కారణాల వల్ల పోటీలో కొనసాగలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు. ఇది పూర్తిగా ఆరోగ్య సమస్యల వల్లే తీసుకున్న నిర్ణయమని, మరో కారణం లేదని ఆమె పేర్కొన్నారు.