ఒకప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధరలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1.82 లక్షలకు చేరగా, 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.41 లక్షల వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ఆకాశాన్నంటిన ధరలతో పోలిస్తే రెండు లోహాల విలువ గణనీయంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరల పెరుగుదల, మదుపరుల పెట్టుబడి వ్యూహాల్లో మార్పులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి….
వెండి ధరలో భారీ పతనం..
వెండి ధరలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ ఏడాది జనవరిలో కిలో వెండి ధర ఏకంగా రూ.4 లక్షలు పలికింది. దీంతో వెండి కొనుగోలు చేయాలంటే సామాన్యులు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అదే వెండి ధర రూ. 1.82లక్షలకు దిగివచ్చింది. అంటే పది నెలల వ్యవధిలోనే దాదాపు సగానికిపైగా పడిపోయింది. శనివారం కిలో వెండి ధర రూ.1,82,737గా ఉంది. గతంలో భారీగా పెరిగిన వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అయితే ధరలు మరింత తగ్గుతాయా? మళ్లీ పుంజుకుంటాయా? అన్నది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంది.
అక్టోబర్ 22వ తేదీ వరకు గరిష్టంగా కిలో వెండి ధర రూ.2,25,000గా ఉంది. 23వ తేదీ రూ. 5 వేలు తగ్గింది. దీంతో ధర రూ.2,20,000 అయింది. నాటి నుంచి 28వ తేదీ వరకు అదే ధర కొనసాగింది. అయితే అక్టోబర్ 29వ తేదీ రూ. 5 వేలు తగ్గింది. 30వ తేదీ మరో రూ.5 వేలు తగ్గింది. ఇక ఈ రోజు ఏకంగా రూ.10,000 తగ్గింది…
పారిశ్రామిక రంగంలోనూ తగ్గిన డిమాండ్
వాస్తవానికి వెండికి పారిశ్రామిక రంగంలో భారీ ప్రాధాన్యత ఉంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా డిమాండ్ మందగించింది. గతంలో సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు ఆ ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు సరికొత్త టెక్నాలజీని వాడుతూ, వెండి వాడకాన్ని భారీగా తగ్గిస్తున్నాయి. ఇంతకుముందు వెండి ధరలు భారీ స్థాయిలో పెరగడంతో, సాధారణ కొనుగోలుదారులు క్రమంగా వెండి ఆభరణాలు, వస్తువులు కొనడం తగ్గించుకున్నారు. మెటల్ ఫోకస్ నివేదిక ప్రకారం, రానున్న 12 నెలలపాటు వెండిపై ఈ ఒత్తిడి ఇలానే కొనసాగే అవకాశం..!