మిచెల్ స్టార్క్‌ బౌలింగ్ దెబ్బకు బంగ్లా విల‌విల‌.. 64 ప‌రుగుల‌కే ఆలౌట్..!

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో తేలిపోయింది. తొలి సెష‌న్ మొద‌లైందో లేదో మిచెల్ స్టార్క్‌(6-12) నిప్పులు చెర‌గ‌డంతో 12 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయిన బంగ్లా ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. మ‌రో ఎండ్‌లో క‌మిన్స్‌(3-25) సైతం చెల‌రేగ‌గా లంచ్ త‌ర్వాత ప‌ర్యాట‌క జ‌ట్టు ఇన్నింగ్స్ ముగిసింది. సంచ‌ల‌న బౌలింగ్‌తో స్టార్క్ బెంబేలెత్తించ‌గా 64 ప‌రుగుల‌కే బంగ్లా కుప్ప‌కూలింది.డార్విన్ టెస్టులో ఓట‌మితో ర‌గిలిపోతున్న ఆస్ట్రేలియా పంజా విసిరింది. మెక్‌కేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను మిచెల్ స్టార్క్‌(6-12) ఆదిలోనే గ‌ట్టిదెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ మొద‌టి బంతికే ఓపెన‌ర్ ష‌ద్మాన్ ఇస్లాం(0)ను ఔట్ చేసి ఆసీస్‌కు బ్రేకిచ్చాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో వ‌ర‌స బంతుల్లో గ‌త మ్యాచ్ సెంచ‌రీ హీరో తంజిద్ హ‌స‌న్‌(0), కెప్టెన్ న‌జ్ముల్ హుసేన్ శాంటో(0)ల‌ను వెన‌క్కి పంపాడు స్టార్క్.మెయిడెన్ ఓవ‌ర్ల‌తో బంగ్లాను బెంబేలెత్తించిన ఈ స్పీడ్‌స్ట‌ర్ కాసేప‌టికే మొమినుల్ హ‌క్‌(9), లిట‌న్ దాస్‌(0)ల‌ను పెవిలియ‌న్ చేర్చాడు. దాంతో, చూస్తుండ‌గానే 12 ప‌రుగుల‌కే స‌గం మంది బ్యాట‌ర్లు వెనుదిరిగారు. వీరిలో న‌లుగురు డ‌కౌట‌య్యారు. అనంత‌రం క‌మిన్స్(3-25) ఓవ‌ర్లో ముష్ఫిక‌ర్ ర‌హీం(5) ఔట‌వ్వ‌గా ఆరో వికెట్ కోల్పోయింది..