Ayyappa.. శబరిమలైలో అయ్యప్ప జ్యోతి దర్శనం..

శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. పోన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. ఈ సందర్భంగా హరిహరక్షేత్రం శబరిమల ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి తళుక్కున మెరిసిన మకర జ్యోతిని దర్శించుకున్నారు…జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు.

అనంతరం మూలమూర్తికి హారతినిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు..

మకర విలక్కు (మకర జ్యోతి) అంటే ఏమిటి?

మకర విలక్కు శబరిమలలోని ప్రధాన ఆధ్యాత్మిక విషయాలలో ఒకటి. మకర జ్యోతి శబరిమల ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాంబలం కొండపై భక్తులకు మూడుసార్లు కనిపిస్తుంది. స్థానిక భక్తుల ప్రకారం, ఈ పవిత్ర మకరజ్యోతిని అయ్యప్ప భగవంతుని దైవిక ఉనికి, ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు..

మకర జ్యోతి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతమకర విలక్కు (మకర జ్యోతి) అనేది విశ్వాసం, భక్తి, దైవిక శక్తి కలిసే శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షణం. అయ్యప్ప మాలధారులు పొన్నాంబలమేడు పైనుంచి కనిపించే మకర జ్యోతి దర్శించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు మకర జ్యోతి దర్శనం చూసేందుకు వెళ్తుంటారు. అయ్యప్ప భక్తులు మాలధారణ సమయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను అనుసరిస్తారు.

మకర జ్యోతి మతపరమైన ఆచారంగా వస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో భోగి పండుగ నాడు పొన్నాంబలమేడు పైనుంచి భక్తులకు మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఈ సమయంలో భక్తులు శబరిమల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అయ్యప్ప స్వామికి ప్రార్థనలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. మకర జ్యోతిని చూడటం వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. .