పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను ప్రకటించింది. ‘బాబ్ కే సంగ్ త్యోహార్ కీ ఉమంగ్ – శుభ్ భీ, లాభ్ భీ’ పేరిట రూపొందించిన ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇందులో భాగంగా రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్, ప్రత్యేక పొదుపు ఖాతాలు, డెబిట్ కార్డు ఆధారిత లావాదేవీలపై రాయితీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు మరింత చేరువయ్యేలా 7.40 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. వీటిపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేయడంతో పాటు కనీస డాక్యుమెంటేషన్‌తో వేగంగా రుణాలు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇళ్ల స్థలాల కొనుగోలు కోసం ‘బాబ్ స్వభూమి’ ప్లాట్ లోన్లను కూడా సున్నా ప్రాసెసింగ్ ఫీజు, సుదీర్ఘ కాలపరిమితితో ఇస్తున్నట్లు పేర్కొంది. మహిళా దరఖాస్తుదారులకు వడ్డీ రేటులో అదనంగా 0.05 శాతం, 40 ఏళ్లలోపు యువత, ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగులు, హెచ్ఎన్ఐ వినియోగదారులకు 0.10 శాతం వరకు ప్రత్యేక వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు వివరించింది..
“వాహన రుణాల విభాగంలో 7.85 శాతం ప్రారంభ వడ్డీకే కార్ లోన్లను మంజూరు చేస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఈవీల కొనుగోలును ప్రోత్సహించేందుకు ‘బాబ్ గ్రీన్ వీల్స్’ పథకం కింద అదనంగా 0.15 శాతం వడ్డీ తగ్గింపుతో పాటు చెల్లింపుల గడువును పొడిగించింది. అలాగే పండుగ షాపింగ్, ప్రయాణాలు, కిరాణా సరుకులు, రెస్టారెంట్ బిల్లుల చెల్లింపులపై బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగదారులకు పలు వాణిజ్య సంస్థల భాగస్వామ్యంతో తక్షణ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహించేందుకు ‘బాబ్ ఫ్లెక్సీ సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్’ కింద నెలకు కేవలం రూ. 500 నుంచే పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పొదుపు పథకాలను అమలు చేస్తున్నట్లు బీవోబీ వెల్లడించింది. ఎన్నారై మహిళల కోసం ‘బాబ్ గ్లోబల్ విమెన్ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో’ సేవింగ్స్ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా, ఆటో స్వీప్ వెసులుబాటు కల్పించగా, ‘బాబ్ విమెన్ సఫైర్’ ఖాతాదారులకు రూ. 10 లక్షల వరకు క్యాన్సర్ కేర్ కవరేజ్, ఉచిత ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ తదితర ప్రయోజనాలను అందిస్తోంది. ఎంఎస్ఎంఈల విస్తరణ కోసం ‘బాబ్ గ్రీన్ ప్లగ్’ ద్వారా ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ స్వాపింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. 5 కోట్ల వరకు రుణాలు సమకూరుస్తున్నట్లు స్పష్టం చేసింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘బరోడా మహిళా స్వావలంబన్’ పేరిట ఎలాంటి పూచీకత్తు లేకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే వ్యాపార రుణాలు అందజేస్తున్నామని బ్యాంక్ తెలిపింది. పండుగ వేళ ప్రతి కుటుంబ కలలను సాకారం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ పేర్కొన్నారు.”