బిహార్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుస వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జముయి, సమస్తీపూర్, దర్భంగా జిల్లాల్లో జరిగిన దారుణాలు మరువక ముందే తాజాగా బంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మందార్ పర్వతంపై ఓ యువతి పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది…బాధితురాలు తన ఇద్దరు స్నేహితులతో కలిసి మందార్ కొండకు వెళ్లినప్పుడు అబ్దుల్లా, నితీష్ కుమార్ రాయ్, వికాస్ కుమార్ అనే ముగ్గురు యువకులు వారిని అడ్డగించారు. యువతిని వేధించడమే కాకుండా, వారిని బెదిరించి బాధితురాలి స్నేహితుడి ఖాతా నుంచి ఆన్లైన్ ద్వారా రూ.1,500 బలవంతంగా బదిలీ చేయించుకుని విడిచిపెట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి వివరాలు బయటపెడుతూ వీడియో షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు.,
https://x.com/i/status/2103332548713889960
ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ ఫైర్
ఈ ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా చచ్చిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బంకా మృగాలను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. గతంలో జరిగిన జముయి కేసులో మిగిలిన ఐదుగురు నిందితులు ఏమయ్యారని, సమస్తీపూర్ కేసులో నలుగురు నిందితులకు పూర్తి శిక్ష పడిందా లేక కుల సమీకరణాల ఆధారంగా వదిలేశారా అని నిలదీశారు. నిందితుల రీల్స్, కులం చూసి ముఖ్యమంత్రి న్యాయం నిర్ణయిస్తున్నారని తేజస్వి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వరుస ఘటనలతో కలకలం
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. బీహార్లో వారంలోనే ఇది మూడో ఘటన కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం దర్భంగా జిల్లా కీరత్పూర్ గ్రామంలో పాఠశాలకు వెళ్తున్న బాలిక దుపట్టాను బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు లాగేందుకు ప్రయత్నించారు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే వారు పారిపోయారు. జమాల్పూర్ పోలీసులు ఐదు గంటల్లోనే నిందితులను పట్టుకుని పోక్సో, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఇందులో 19 ఏళ్ల యువకుడిని జైలుకు తరలించగా, మరో మైనర్ నిందితుడిని జువైనల్ బోర్డు ముందు హాజరుపరిచారు…మరోవైపు సెప్టెంబర్ 19న జముయిలో కోచింగ్ సెంటర్లో చదువుతున్న ఓ బాలిక, బాలుడిని కొందరు ఆకతాయిలు రోడ్డుపై ఆపి వేధించిన వీడియో వైరల్ అయింది. ఈ కేసులో మంగళవారం జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో ఇద్దరు ప్రధాన నిందితులు గాయపడగా వారిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్లతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ వేధింపుల ఘటనలు పోలీసు యంత్రాంగానికి సవాల్గా మారాయి.
సమస్తీపుర్లోనూ వేధింపులు
జాముయి ఘటన మరువకముందే సమస్తీపుర్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.
ఓ టీనేజీ బాలిక, బాలుడు కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ఫొటోలు తీసుకుంటుండగా కొందరు ఆకతాయిలు వారిని అడ్డుకున్నారు.
అనంతరం బాలికతో అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన కూడా తీవ్ర చర్చకు దారితీసింది.
వరుస ఘటనలతో రాజకీయ దుమారం
బిహార్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి.
రాష్ట్రంలో అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
తాజాగా మందర్ హిల్ ఘటన వెలుగులోకి రావడంతో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.