Bisleri శాంపిల్లో క్యాన్సర్ కారకాలు.. కంపెనీపై కేసుకు FSSAI అనుమతి..!

Bisleri శాంపిల్లో క్యాన్సర్ కారకాలు.. కంపెనీపై కేసుకు FSSAI అనుమతి..

బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గుర్తించింది. రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీ పరీక్షల్లో నీటి శాంపిల్స్లో బ్రోమేట్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలడంతో, కంపెనీపై చట్టపరమైన చర్యలకు అనుమతి లభించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ కేసు నమోదు చేయబడుతోంది…

పరీక్షలో బ్రోమేట్ పరిమితి మించిందని గుర్తింపు

FSSAI వివరాల ప్రకారం.. బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రాంగణం నుంచి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాను అధికారులు సేకరించారు. సాధారణంగా తాగే నీటి నాణ్యతను పరిశీలించే క్రమంలో ఈ నమూనాను ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల్లో అందులో బ్రోమేట్ స్థాయి నిర్దేశించిన పరిమితులకు అనుగుణంగా లేదని తేలింది. దీంతో ఆ నీటిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం సురక్షితం కాదని ప్రకటించారు. ఈ ఫలితంపై కంపెనీ అప్పీల్ చేయడంతో నమూనాను మరోసారి పరిశీలించేందుకు రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు.

రెండో ల్యాబ్ పరీక్షలోనూ PAHs గుర్తింపు

కంపెనీ అప్పీల్ తర్వాత రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలోనూ నమూనాను పరీక్షించారు. ఈసారి అందులో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించారని FSSAI వెల్లడించింది. దీంతో రెండో ప్రయోగశాల కూడా ఆ నమూనాను సురక్షితం కాదని ప్రకటించింది. బ్రోమేట్ అనేది నీటిలో నిర్ణీత పరిమితికి మించి ఉండకూడని రసాయన సమ్మేళనం. ఇక PAHs అనేవి పలు రకాల రసాయన సమ్మేళనాల సమూహం. వీటిలో కొన్ని పదార్థాలకు క్యాన్సర్ ముప్పుతో సంబంధం ఉన్నట్లు శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఈ నమూనాలో ఏ రకమైన PAHs ఎంత మోతాదులో ఉన్నాయనే వివరాలను FSSAI బహిరంగంగా వెల్లడించలేదు.

బిస్లరీపై కేసుకు అనుమతి

ప్రయోగశాలల నివేదికల ఆధారంగా ఆహార భద్రత చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లు FSSAI నిర్ధారించింది. దీంతో బిస్లరీ ఇంటర్నేషనల్‌పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే కంపెనీపై చట్టపరమైన విచారణ, కోర్టు చర్యలు చేపట్టేందుకు మార్గం ఏర్పడింది. అయితే ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం అంటే కంపెనీ దోషిగా తేలినట్లు కాదు. తుది నిర్ణయం న్యాయ ప్రక్రియలో వెలువడుతుంది. ఇదే సమయంలో వసంత్ మసాలా, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా, మిమాంసా ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ సంస్థలపైనా FSSAI ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది..