బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఈ ఒప్పందం .
బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఈ ఒప్పందం కుదరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇటీవలే రాజీనామా చేసిన అన్నామలై సమక్షంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఈ పరిణామం తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకు కష్టకాలం తెచ్చినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోమారు సీఎం పదవి చేపడతానని ధీమాగా ఉన్న సీఎం ఎంకే స్టాలిన్ ఆశలపై ఈ పరిణామం నీళ్లు చల్లేస్తుందా? అన్న దిశగానూ విశ్లేషణలు సాగుతున్నాయి.
అన్నాడీఎంకేతో ఒప్పందం సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ పర్యాయం అన్నాడీఎంకేతో పొత్తుతో ముందుకెళ్లిన బీజేపీ… తమిళనాట ఏకంగా 30 లోక్ సభ స్థానాలను గెలిచిందని ఆయన గుర్తు చేశారు. తాజాగా రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో తమిళనాట భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మేలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగానే సమయం ఉండగానే… వ్యూహాత్మకంగా సాగిన బీజేపీ, అన్నాడీఎంకేలు ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నాయని చెప్పాలి. రెండు పార్టీల మధ్య ఒప్పందం కంటే కూడా రెండు పార్టీల శ్రేణులు కలిసి సాగితేనే తమిళనాట ఎన్డీఏకు అధికారం దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయంలో అన్నీ ఆలోచించుకునే ఇరు పార్టీలు… తమ రెండు పార్టీల శ్రేణులు కలిసి సాగేందుకు కొంత సమయం అవసరమన్న భావనతోనే ఏడాది ముందుగానే పొత్తుపై నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.