ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి…
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు..ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గూండా రాజ్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గూండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు అరాచకాలకు చిరునామాగా మారిందని విమర్శించారు. దాడులు, గూండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందని అన్నారు..
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
హరీశ్ రావు వార్నింగ్
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నది. యదా రాజ తథా ప్రజా అన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నరు అని హరీశ్ రావు మండిపడ్డారు..
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో చిల్లర వేషాలు వేస్తున్నారని… ప్రతిపక్ష నాయకులు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పకుండా. దాడులు చేస్తే ప్రశ్నించరు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని ఆరోపించారు…. ఇలాంటి చిల్లర మల్లర వేషాలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బయపడదని అన్నారు… ప్రజలన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి గోరి కట్టే రోజుల దగ్గరలోనే ఉన్నాయని అన్నారు..