అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేత హరీష్రావు తెలిపారు. సభను నడిపే తీరు అధ్వాన్నంగా ఉందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
మూసీ ప్రక్షాళన అంశంపై బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని హరీష్రావు ఆరోపించారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో పాటు మైక్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. మాట్లాడనివ్వని సభకు ఎందుకు రావాలని ప్రశ్నించారు.
అంతేకాకుండా, ముఖ్యమంత్రి అసెంబ్లీని బూతులమయంగా మార్చారని విమర్శించారు. అసెంబ్లీని కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంగా మార్చారని వ్యాఖ్యానించారు.
మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే ఈ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని హరీష్రావు స్పష్టం చేశారు…అయితే, రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధానమంత్రి మీద మాట్లాడటం లేదా అని హరీష్ రావు అడిగారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాకు ఉంది.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు సభలో ఎక్కువైంది.. ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సి ఉంది.. గాంధీభవన్ లో మాట్లాడే సొల్లు అసెంబ్లీలో మాట్లాడతారా అని ప్రశ్నించారు. దీని కోసమైనా అసెంబ్లీ పెట్టడం.. మల్లన్న సాగర్ నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీరు తెస్తున్నారా అని అడిగాం.. మూసీ ప్రక్షాళనకు నడుము బిగించిందే బీఆర్ఎస్.. బాడీ షేమింగ్ కు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు.. రౌడీషీటర్స్ ఇంకా మంచిగా మాట్లాడుతారని హరీష్ రావు అన్నారు.
ఇక, కేసీఆర్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకుండా శాసనసభలో కూర్చోవడం వెస్ట్.. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది.. సభలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. సీఎం అడ్డగోలుగా మాట్లాడితే స్పీకర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు..
ఈ అంశాలపై స్పష్టత ఇవ్వడానికి రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో ప్రెజెంటేషన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.