చంద్రబాబు అధ్యక్షతన రేపటి నుంచి రెండు రోజుల కలెక్టర్ల సదస్సు.!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్యల నివేదికలను సమీక్షించనున్నారు.
ఇది 8వ కలెక్టర్ల సదస్సు కాగా.. తొలిరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, GSDP, స్వర్ణాంధ్ర విజన్‌, సూపర్ సిక్స్‌ హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
రెండో రోజు ఇ-గవర్నెన్స్‌, ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం, RTGS తదితర అంశాలపై చర్చ జరగనుంది. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు తెలుసుకోనున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించి.. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. నిర్ణయాలను క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు పనిచేయాలని సీఎం సూచించనున్నట్లు సమాచారం.